Share News

ఇరాన్‌తో ఉద్రిక్తతలు.. ట్రంప్‌నకు షాకిచ్చిన బ్రిటన్

ABN , Publish Date - Feb 20 , 2026 | 09:34 AM

బ్రిటన్‌లోని ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక స్థావరం నుంచి దాడులకు అనుమతిచ్చేది లేదని బ్రిటన్ అమెరికాకు తేల్చి చెప్పింది. ఈ అనుమతిస్తే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్టు అవుతుందని బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇరాన్‌తో ఉద్రిక్తతలు.. ట్రంప్‌నకు షాకిచ్చిన బ్రిటన్
UK blocks US preemptive strike plans from Fairford Base

ఇంటర్నెట్ డెస్క్: తమ వైమానిక స్థావరం ఫెయిర్‌ఫోర్డ్‌ నుంచి ఇరాన్‌పై ముందస్తు దాడులకు అనుమతించేది లేదని బ్రిటన్ ప్రభుత్వం తాజాగా అమెరికాకు స్పష్టం చేసింది. దాడులకు అనుమతిస్తే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్టు అవుతుందని భావించిన బ్రిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇరాన్‌‌తో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనికదళాలను మోహరిస్తోంది. ఇరాన్‌ను అడ్డుకునేందుకు ముందస్తు దాడులు చేయాల్సి రావచ్చనే అంచనాతో తగు ప్రణాళికలనూ రూపొందించుకుంది. ఇందులో భాగంగా హిందూ మహాసముద్రంలోని ఛాగోస్ ద్వీప సముదాయంలోని డియేగో గార్సియా సైనిక స్థావరంతో పాటు బ్రిటన్‌లోని ఫెయిర్‌ఫోర్డ్‌‌‌ను ఎంచుకుంది. ఇరాన్ దాడులను ఃఅడ్డుకునేందుకు ఈ రెండూ కీలకమని భావిస్తోంది.


డియేగో గార్సియా సైనిక స్థావరాన్ని అమెరికా, బ్రిటన్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. బ్రిటన్ ఆధీనంలోని ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక స్థావరంలో అమెరికాకు చెందిన భారీ బాంబర్స్ సిద్ధంగా ఉన్నాయి. అమెరికా భారీ బాంబర్ విమానాలకు అనుకూలమైన వైమానిక స్థావరం యావత్ యూరప్‌లో ఫెయిర్‌ఫోర్డ్ ఒక్కటే. దీంతో, అవసరమైతే ఫెయిర్‌ఫోర్డ్‌‌ను వినియోగించుకునేందుకు అనుమతి కోసం అమెరికా పట్టుబడుతుండగా బ్రిటన్ నిరాకరించింది.

ముందస్తు దాడులపై బ్రిటన్ ప్రభుత్వం మొదటి నుంచీ విముఖత వ్యక్తం చేస్తోంది. మిత్ర దేశం చేసే చట్టవ్యతిరేక దాడులకు సహకరించే దేశం కూడా జరిగిన తప్పునకు బాధ్యత వహించాల్సి వస్తుందన్న అంతర్జాతీయ చట్టాల నేపథ్యంలో బ్రిటన్ వెనకాడుతోంది. గతంలో ఇరాన్‌పై జరిగిన దాడుల్లో కూడా బ్రిటన్ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కేవలం తమ వైమానిక స్థావరాల రక్షణకే పరిమితమైంది. ఇక బ్రిటన్ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డియేగో గార్సియా ద్వీపాన్ని మారిషస్‌కు అప్పగించాలన్న బ్రిటన్ ప్రయత్నాన్ని ఇప్పటికే పలుమార్లు విమర్శించారు. ఇక ఫెయిర్‌ఫోర్డు నుంచి దాడులకు బ్రిటన్ అనుమతించనందున డీయేగో గార్సియా వ్యవహారంలో అమెరికా మోకాలడ్డొచ్చన్న అంచనాలు ఉన్నాయి.


ఇవీ చదవండి:

భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ నోట అదే మాట

అఫ్గానిస్థాన్‌లో గృహహింస చట్టబద్ధం!

Updated Date - Feb 20 , 2026 | 11:14 AM