Share News

భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ నోట అదే మాట

ABN , Publish Date - Feb 20 , 2026 | 08:01 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాట అందుకున్నారు. భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని తెలిపారు. ఈ ఘర్షణల్లో 11 యుద్ధ విమానాలు కూలిపోయాయని తెలిపారు.

భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ నోట అదే మాట
Donald Trump on India-Pak War

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి భారత్-పాక్ యుద్ధం గురించి ప్రస్తావించారు. ఆ యుద్ధాన్ని తానే ఆపానని ప్రకటించారు. గాజా శాంతి మండలి సమావేశంలో తాజాగా ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. ఈ ఘర్షణల్లో ఖరీదైన 11 యుద్ధ విమానాలు కూడా కూలిపోయాయని చెప్పుకొచ్చారు. ‘(అమెరికాతో) వాణిజ్య ఒప్పందాలు లేకపోతే డబ్బు నష్టపోవాల్సి వస్తుందని వారు యుద్ధం వద్దని అనుకున్నారు. అప్పటికే 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి. అవి చాలా ఖరీదైనవి’ అని ట్రంప్ అన్నారు.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పహల్గాం దాడి తరువాత దాయాది దేశంపై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. భారత్ జరిపిన ముప్పెట దాడితో ఉక్కిరిబిక్కిరైన పాక్ చివరకు దారికొచ్చింది. భారత్ ముందు కాల్పుల విరమణ ప్రస్తావన తెచ్చింది. అయితే, ఇరు దేశాల మధ్య తానే రాజీ కుదిర్చానంటూ ట్రంప్ ఇప్పటివరకూ 80 సార్లకు పైగా వివిధ వేదికల్లో చెప్పుకొచ్చారు. ట్రంప్ ప్రకటన వెలువడిన ప్రతిసారీ భారత్ ఖండిస్తూ వస్తోంది. పాక్‌తో వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని ఆమోదించబోమని పలుమార్లు స్పష్టం చేసింది.


ట్రంప్ మాత్రం తన వల్లే యుద్ధం ఆగిందని తరచూ చెబుతున్నారు. అమెరికాతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవాలంటే వెనక్కు తగ్గాలని చెప్పడంతో ఇరు దేశాలు రాజీమార్గం పట్టాయని ట్రంప్ చెప్పుకుంటారు. రాజీకి తానే కారణమని మొదటిసారి ప్రకటించిన సమయంలో ట్రంప్ 5 ఫైటర్ జెట్స్ కూలిపోయాయని పేర్కొన్నారు. ఏడు జెట్స్ కూలిపోయాయని కొద్ది నెలల తరువాత చెప్పారు. ఇలా కూలిన జెట్స్ సంఖ్యను క్రమక్రమంగా పెంచుతున్న ట్రంప్ తాజాగా 11 జెట్స్ కూలిపోయాయని అన్నారు.


ఈ వార్తలూ చదవండి:

అఫ్గానిస్థాన్‌లో గృహహింస చట్టబద్ధం!

వారాంతంలో ఇరాన్‌పై అమెరికా దాడి!

Updated Date - Feb 20 , 2026 | 08:39 AM