Share News

పాక్ మధ్యవర్తిత్వం! ఇస్లామాబాద్ వేదికగా యూఎస్-ఇరాన్ చర్చలకు ప్రతిపాదన

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:27 PM

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య శాంతిస్థాపన దిశగా తదుపరి దశ చర్చలకు ఇస్లామాబాద్‌ను వేదికగా ఎంచుకోవాలని పాక్ సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పాక్ మధ్యవర్తిత్వం! ఇస్లామాబాద్ వేదికగా యూఎస్-ఇరాన్ చర్చలకు ప్రతిపాదన

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు పాక్‌కూ ఇబ్బందికరంగా మారాయి. అటు అమెరికా, గల్ఫ్ దేశాలతో, ఇటు ఇరాన్‌తో పాక్‌కు మంచి సంబంధాలు ఉండటంతో దాయాది దేశం ఆచితూచి వ్యవహరిస్తోంది. తాను మరింత చిక్కుల్లో పడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చేందుకు యుద్ధం మొదలైన నాటి నుంచీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. శాంతిస్థాపన దిశగా తదుపరి దశ చర్చలకు వేదికగా ఇస్లామాబాద్‌ను ఎంచుకోవాలని కూడా పాక్ తాజాగా ఆయా దేశాలకు ప్రతిపాదించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇరాన్‌పై దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారట. మరోవైపు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా సోమవారం ఇరాన్ అధ్యక్షుడితో చర్చలు జరిపారట. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని కూడా చెప్పారట. ఈ దిశగా తదుపరి దశ చర్చలు ఇస్లామాబాద్‌లో జరిగే అంశాన్ని పరిశీలించాలని ఇరు దేశాల నేతలకు సూచించారట.


ఇక యుద్ధం మొదలైన నాటి నుంచీ పాక్ అధికారులు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య అనుసంధానకర్తలుగా ఉంటున్నారని కూడా కథనాలు వెలువడ్డాయి. పాక్‌తో పాటు తుర్కియే, ఈజిప్టు కూడా సయోధ్య కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్న నేపథ్యంలో దాడులకు ఐదు రోజుల విరామం ఇచ్చామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా అధ్యక్షుడి ప్రకటనను ఇరాన్ ఖండించింది. అమెరికాతో తాము నేరుగా ఎలాంటి చర్చలూ జరపలేదని పేర్కొంది. హోర్ముజ్ జలసంధి వ్యవహారాలు, యుద్ధం ముగింపునకు సంబంధించి తమ ధోరణిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.


ఈ వార్తలూ చదవండి:

యుద్ధానికి మొదటగా సై అన్నది మీరేగా.. యుద్ధ శాఖ మంత్రిపై ట్రంప్ కీలక కామెంట్స్

ట్రంప్‌తో చర్చల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

Updated Date - Mar 24 , 2026 | 02:49 PM