Share News

యూఏఈకి భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: ప్రధాని మోదీ

ABN , Publish Date - May 15 , 2026 | 01:57 PM

యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ అల్ నహ్యాన్‌తో సమావేశమయ్యారు. యూఏఈపై దాడులను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు.

యూఏఈకి భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది: ప్రధాని మోదీ
PM Modi UAE tour

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. అబుదాబీ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాధినేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనకు అపూర్వ స్వాగతం పలికినందుకు యూఏఈ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.

గల్ఫ్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈని కూడా టార్గెట్ చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ దాడులను భారత్ ఖండిస్తోందని అన్నారు. ఈ క్లిష్ట సమయంలో యూఏఈ సంయమనం పాటించడం అభినందనీయమని కూడా చెప్పారు. యూఏఈలోని భారతీయుల రక్షణకు చర్యలు తీసుకున్నందుకు కూడా ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. అక్కడి భారతీయులను యూఏఈ సొంత కుటుంబంలా చూసుకుందని చెప్పారు. ఇందుకు భారత ప్రభుత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతోందని అన్నారు.


ఈ క్లిష్ట సమయంలో భారత్ యూఏఈకి అండగా ఉంటుందని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి భారత్ ఎల్లప్పుడూ చర్చలు, దౌత్యానికే ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలో భద్రమైన స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పేందుకు తాము తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు.

ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు కీలక అంశాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, ఎల్‌పీజీ సరఫరా, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు, భారత్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ఇరు దేశాధినేతల సమక్షంలో అధికారులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. యూఏఈ తరువాత నెదర్‌లాండ్స్, స్వీడెన్, నార్వే, ఇటలీ దేశాల్లో కూడా ప్రధాని మోదీ పర్యటిస్తారు.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా వీసాల కోసం భారతీయులు ‘వీసా ఆలయా’నికి వెళ్తారు!

చైనా టూర్‌కు ముందు ట్రంప్ సీక్రెట్ లెటర్.. నాకేమైనా అయితే..

Updated Date - May 15 , 2026 | 02:13 PM