Share News

ఖతర్ మంత్రి హెచ్చరిక! యుద్ధం మరో రెండు వారాల పాటు కొనసాగితే..

ABN , Publish Date - Mar 06 , 2026 | 07:05 PM

మధ్య ప్రాచ్యంలో యుద్ధం మరో రెండు, మూడు వారాల పాటు ఇలాగే కొనసాగితే ముడి చమురు బ్యారెల్ ధర 150 డాలర్లకు ఎగబాకుతుందని ఖతర్ ఇంధన శాఖ మంత్రి తాజాగా హెచ్చరించారు.

ఖతర్ మంత్రి హెచ్చరిక! యుద్ధం మరో రెండు వారాల పాటు కొనసాగితే..
Qatar Minister Warning on Crude Oil Prices

ఇంటర్నెట్ డెస్క్: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని ఖతర్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్ ఖాబీ హెచ్చరించారు. గల్ఫ్ దేశాలు ఇంధన ఎగుమతులను నిలిపివేసే అవకాశం ఉందని అన్నారు. యుద్ధం ఇలాగే మరో రెండు మూడు వారాల పాటు కొనసాగితే గ్లోబల్ మార్కెట్స్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లకు ఎగబాకవచ్చని హెచ్చరించారు.

ఎల్‌పీజీ ఇంధన ఉత్పత్తిని ఖతర్ సోమవారం నిలిపివేసినట్టు మంత్రి తెలిపారు. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇతర దేశాలు కూడా త్వరలో ఇలాగే చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ పరిస్థితులు ప్రపంచ జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని అన్నారు.


యుద్ధం ఇప్పటికిప్పుడు ముగిసిపోయినా ఖతర్ నుంచి ఇంధన ఎగుమతులు సాధారణ స్థాయికి చేరేందుకు కొన్ని వారాలు లేదా నెలలు పట్టవచ్చని అన్నారు. పెట్రో కెమికల్స్, ఫెర్టిలైజర్ ఫీడ్ స్టాక్స్‌ను కూడా గల్ఫ్ దేశాలు సరఫరా చేస్తున్నాయి కాబట్టి ఆయా రంగాలపై కూడా ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరించారు. ముడి చమురు ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు.

హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ముడి చమురు రవాణాపై తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ ప్రాంతంలో పలు నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో, గ్లోబల్ మార్కెట్స్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి.


ఈ వార్తలూ చదవండి:

ఈ క్షిపణితోనే ఖమేనీపై మెరుపు దాడి!

ఒమన్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.. ఇద్దరు భారతీయుల మృతి

Updated Date - Mar 06 , 2026 | 07:12 PM