Share News

మళ్లీ దాడులకు దిగిన ఇరాన్.. గల్ఫ్‌లో కలకలం

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:16 PM

కువైట్, బహ్రెయిన్‌పై ఇరాన్ మళ్లీ మిసైల్స్ ప్రయోగించడంతో గల్ఫ్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ మిసైల్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మళ్లీ దాడులకు దిగిన ఇరాన్.. గల్ఫ్‌లో కలకలం
Iran Targets Bahrain, Kuwait

ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్‌లో మళ్లీ కలకలం రేగుతోంది. కువైట్, బహ్రెయిన్‌లను టార్గెట్ చేస్తూ ఇరాన్ శనివారం మిసైల్స్‌ను ప్రయోగించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా తమను రెచ్చగొట్టడంతోనే ఈ దాడులు చేయాల్సి వచ్చిందని ఇరాన్ ఆరోపించింది. కువైట్, బహ్రెయిన్ గగనతలంలో మిసైల్స్ దూసుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ దాడుల నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్‌ ప్రభుత్వాలు సైరెన్‌లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశాయి.

తాజా దాడులపై స్పందించిన ఇరాన్ సైన్యం ప్రతినిధి.. పరిస్థితి మళ్లీ దిగజారడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. కువైట్, బహ్రెయిన్‌ వైపు వెళుతున్న విమానాలను దారి మళ్లించాలని సూచించారు. అక్కడి ప్రజలు ఎయిర్‌పోర్టులకు దూరంగా ఉండాలని చెప్పారు. మరోవైపు, ఇరాన్ దాడుల నేపథ్యంలో శనివారం కువైట్ ఎయిర్‌పోర్టులో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లించినట్టు ఫ్లైట్ రాడార్ 24 సంస్థ పేర్కొంది. యూఎస్ సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలను ఇరాన్ తరచూ టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.


ఇరాన్ మొత్తం ఏడు మిసైల్స్‌ను కువైట్, బహ్రెయిన్ వైపు ప్రయోగించిందని అమెరికా సైనిక అధికారులు తెలిపారు. తాము ఆరు మిసైల్స్‌ను అడ్డుకున్నామని, ఒక ఇరాన్ మిసైల్ అసలు లక్ష్యాన్నే చేరుకోలేదని చెప్పారు. ఇక తమ సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని కూడా అన్నారు. యూఎస్ 5వ ఫ్లీట్‌ ప్రధాన కార్యాలయం ఇరాన్ దాడుల్లో దెబ్బతిందన్న వార్తలను కూడా తోసిపుచ్చారు.

ఇక ఇరాన్ రాడార్ వ్యవస్థలను అమెరికా శుక్రవారం ధ్వంసం చేసింది. వాటితో ప్రాంతీయ భద్రతకు ముప్పు ఉందని పేర్కొంది. ఇరాన్ డ్రోన్‌లను అడ్డుకున్నామని కూడా అమెరికా పేర్కొంది. హిందూ మహాసముద్రంలో ఒక ఇరాన్ నౌకను కూడా అడ్డుకున్నట్టు చెప్పింది. చమురు ఎగుమతితో లాభపడతామనుకున్న ఇరాన్ ప్రయత్నాలకు చెక్ పెట్టామని తెలిపింది.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌పై ఆంక్షల బెదిరింపులు మొదటికే మోసం తెస్తాయి: పుతిన్

సహారా ఎడారిలో విషాదం.. దాహంతో 49 మంది మృతి..

Updated Date - Jun 06 , 2026 | 04:32 PM