Share News

ముడి చమురు.. ఎన్ని రకాలో తెలుసా?

ABN , Publish Date - Mar 10 , 2026 | 10:21 PM

ప్రస్తుతం ఎక్కడ చూసినా ముడి చమురు గురించిన చర్చే. ఈ నేపథ్యంలో అసలు ముడి చమురు ఎన్ని రకాలో, దీన్ని ఎలా వర్గీకరిస్తారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ముడి చమురు.. ఎన్ని రకాలో తెలుసా?
Types of crude oil

ఇంటర్నెట్ డెస్క్: ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతూ ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ముడి చమురు లేదా క్రూడ్ ఆయిల్ గురించే చర్చ జరుగుతోంది. అయితే, క్రూడ్ ఆయిల్‌ల్లో కూడా పలు రకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ విశేషాలేంటో తెలుసుకుందాం.

ముడి చమురు సాంద్రత ఆధారంగా దీన్ని నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. ఈ సాంద్రతను ఏపీఐ గ్రావిటీ (API Gravity) అనే స్కేల్ ఆధారంగా డిగ్రీల్లో కొలుస్తారు. నీటితో పోలిస్తే ముడి చమురు ఎంత మేర తేలిగ్గా లేదా బరువుగా ఉందో ఈ స్కేల్ ద్వారా తెలుసుకోవచ్చు.

లైట్ క్రూడ్ ఆయిల్: ఈ ఆయిల్ పలుచగా ఉంటుంది. దీని ఏపీఐ గ్రావిటీ 31.1 డిగ్రీల కంటే ఎక్కువ. ఈ రకం ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు ఎక్కువ మొత్తంలో వెలికితీయొచ్చు. అమెరికా, నార్త్ సీ ప్రాంతం (యూకే–నార్వే), నైజీరియా, లిబియా, అంగోలా దేశాల్లో ఇది లభిస్తుంది.

మీడియమ్ క్రూడ్: ఈ తరహా ముడి చమురు ఏపీఐ గ్రావిటీ 22.3° నుంచి 31.1° మధ్య ఉంటుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ దేశాల్లో ఈ రకం ఎక్కువగా లభిస్తుంది.

హెవీ క్రూడ్: ఈ క్రూడ్ ఆయిల్ ఏపీఐ గ్రావిటీ 22.3° కంటే తక్కువగా ఉంటుంది. ఇది కొంత చిక్కగా ఉండటంతో అధునాతన రిఫైనింగ్ పద్ధతులు ఉపయోగించి ఇంధనాలను వెలికితీయాల్సి ఉంటుంది. కెనడా, వెనెజువెలా, మెక్సికో, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో (క్యాలిఫోర్నియా) ఇది లభిస్తుంది.

ఎక్స్‌ట్రా హెవీ క్రూడ్: ఈ ఆయిల్ ఏపీఐ గ్రావిటీ 10° కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఈ రకం ముడి చమురు ప్రధానంగా కెనడా, వెనెజువెలా వంటి దేశాల్లో ఎక్కువగా లభిస్తుంది.


ఇక ముడి చమురులోని సల్ఫర్ శాతం ఆధారంగా వీటిని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. సల్ఫర్ శాతం 0.5 శాతానికి లోపుగా ఉన్న ముడి చమురును స్వీట్ క్రూడ్ అని పిలుస్తారు. దీనిలో దుర్వాసన తక్కువ. ఇందులోంచి అధిక నాణ్యతగల ఇంధనాలను వెలికితీస్తారు.

అదే సల్ఫర్ శాతం 0.5 శాతానికి మించిన ముడి చమురును సౌర్ క్రూడ్ అంటారు. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉండటంతో పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఇంధనాలను తయారు చేయడానికి అదనపు ప్రాసెసింగ్ అవసరం అవుతుంది.

ఇక మనకు వార్తల్లో తరచూ వినిపించే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఉత్తర సముద్రం (నార్త్ సీ) ప్రాంతంలోని చమురు క్షేత్రాల్లో ఎక్కువగా లభిస్తుంది. సాంద్రత, సల్ఫర్ శాతం ఆధారంగా దీనిని సాధారణంగా లైట్-స్వీట్ క్రూడ్‌గా వర్గీకరిస్తారు. ప్రపంచ మార్కెట్లో, ముఖ్యంగా యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో చమురు ధరలకు బ్రెంట్ క్రూడ్‌నే ప్రామాణికంగా భావిస్తారు. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి చమురు అమెరికాలో ఉత్పత్తి అవుతుంది. దీన్ని లైట్-స్వీట్ క్రూడ్‌గా వర్గీకరిస్తారు.


మధ్య ప్రాచ్య దేశాల్లో ఉత్పత్తి అయ్యే ముడి చమురులో చాలా భాగం మీడియమ్-సౌర్ కేటగిరీకి చెందినదే. అంటే ఇందులో సల్ఫర్ శాతం 0.5 శాతం కంటే ఎక్కువగా, ఏపీఐ గ్రావిటీ 22.3° నుంచి 31.1° మధ్య ఉంటుంది. ముడి చమురు రకాన్ని బట్టి రిఫైనరీల్లో ప్రత్యేక వ్యవస్థలు ఉంటాయి. చమురు శుద్ధి కోసం వేర్వేరు సాంకేతికతలను వినియోగిస్తారు. ఇక మంచి నాణ్యత ఉండే లైట్-స్వీట్ క్రూడ్ ధర సాధారణంగా హెవీ లేదా సౌర్ క్రూడ్‌ కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..

స్వల్ప తగ్గుదల.. ఈ రోజు వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Mar 10 , 2026 | 10:45 PM