Share News

టర్కీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఐదుగురు సైనికుల మృతి

ABN , Publish Date - Nov 25 , 2026 | 07:22 AM

టర్కీలో మరో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణా విమానయానం సందర్భంగా వైమానిక దళానికి చెందిన AS-532 కూగర్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

టర్కీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఐదుగురు సైనికుల మృతి
Turkey helicopter crash

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ టర్కీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. టర్కీ వైమానిక దళానికి చెందిన AS-532 కూగర్ హెలికాప్టర్ మంగళవారం శిక్షణా విమానయానం సందర్భంగా ఎస్కిసెహిర్ నగరం సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఎస్కిసెహిర్‌లోని 1వ ప్రధాన జెట్ బేస్ నుంచి శిక్షణ కోసం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నగరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని యోరుకాక్‌చాయిర్ గ్రామం సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు గుర్తించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు గాలింపు.. సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని మీడియా కథనాలు వెల్లడించాయి.


రెండు వారాల్లో రెండో హెలికాప్టర్ ప్రమాదం..

టర్కీ సాయుధ దళాల్లో ఇటీవల వరుస హెలికాప్టర్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నవంబర్ 12న దక్షిణ టర్కీలోని మలత్యా సమీపంలో సైన్యానికి చెందిన సికోర్స్కీ S-70 హెలికాప్టర్ కూలిపోవడంతో నలుగురు సిబ్బంది మరణించారు. ఆ ఘటన జరిగిన రెండు వారాల్లోపే మరో ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. AS-532 కూగర్ రెండు ఇంజిన్లతో పనిచేసే బహుళ ప్రయోజన హెలికాప్టర్ కాగా.. ప్రపంచంలోని పలు దేశాల సైనిక దళాలు వీటిని వినియోగిస్తున్నాయి. వరుస ప్రమాదాల నేపథ్యంలో హెలికాప్టర్ల భద్రత, ప్రమాదాలకు గల కారణాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆరనీకుమా ఈ దీపం..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 25 , 2026 | 07:26 AM