US President Donald Trump: నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు!
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:30 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సంతోషంగా లేననే విషయం భారత ప్రధాని మోదీకి తెలుసునన్నారు....
నన్ను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోంది
కానీ, రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలాగే కొనసాగిస్తే భారత్‌పై టారి్‌ఫలు పెంచేస్తా
అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్‌లాండ్ కావాలి: ట్రంప్
గ్రీన్‌లాండ్‌పై పెత్తనం కుదరదు: డెన్మార్ ప్రధాని
ట్రంప్ వద్ద మోదీ మోకరిల్లుతున్నారు.. మిత్రుడిని సంతోషపెట్టేందుకు దేశానికి హాని చేస్తారా?: కాంగ్రెస్
వాషింగ్టన్/న్యూఢిల్లీ, జనవరి 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సంతోషంగా లేననే విషయం భారత ప్రధాని మోదీకి తెలుసునన్నారు. తనను సంతోషపరిచేందుకు భారత్ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. మోదీ మంచి వ్యక్తి అని, కానీ.. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఇలాగే కొనసాగిస్తే మాత్రం భారత్‌పై త్వరలోనే టారి్‌ఫలు పెంచేస్తానని హెచ్చరించారు. ఆదివారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత్‌పై టారిఫ్‌లు తగ్గించాలంటూ అమెరికాలో భారత రాయబారి వినయ్‌మోహన్ క్వాత్రా తమను కోరారని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు. గత నెలలో తాను వినయ్‌మోహన్‌ను ఆయన నివాసంలో కలిసిన సందర్భంలో ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారని, 25 శాతం టారిఫ్ నుంచి భారత్‌ను ఉపశమనం కలిగించాల్సిందిగా కోరారని చెప్పారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ తగ్గించుకునేలా చేసేందుకే ట్రంప్ ఈ టారిఫ్ విధించారని గ్రాహం అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యవహారశైలిని ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుబట్టింది. అమెరికా సెనేటర్ చేసిన వ్యాఖ్యలు.. ట్రంప్ వద్ద మోదీ మోకరిల్లుతున్న తీరును స్పష్టం చేస్తున్నాయని ‘ఎక్స్’లో కాంగ్రెస్ పేర్కొంది. ట్రంప్ కోసం చిరకాల మిత్ర దేశమైన రష్యా నుంచి చమురు కొనుగోలును కూడా మోదీ నిలిపివేశారని ఆరోపించింది. మోదీ తన వ్యక్తిగత పరపతి పెంచుకునేందుకు, ట్రంప్‌ను సంతోషపరిచేందుకు దేశానికి ఎందుకు హాని చేస్తున్నారని ప్రశ్నించింది. మోదీ స్నేహితుడు భారత్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. మేలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ట్రంప్‌పై పొగడ్తలు కురిపిస్తూనే ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.
బెదిరింపులు మానుకోవాలి: డెన్మార్క్
అమెరికా భద్రత కోసం తమకు గ్రీన్‌లాండ్ కూడా కావాలని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా వ్యూహాత్మక రక్షణ స్థావరంగా, ఖనిజ సంపద పరంగా తమకు ఆ ప్రాంతం అవసరమని పేర్కొన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను డెన్మార్క్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ బెదిరింపులు మానుకోవాలని, గ్రీన్‌లాండ్‌ను నియంత్రించాలన్న అమెరికా కోరిక కలగానే మిగిలిపోతుందని అన్నారు. డానిష్ కింగ్‌డమ్‌లోని మూడు దేశాల్లో దేనిపైనా అమెరికాకు ఎటువంటి హక్కుల్లేవని స్పష్టం చేశారు. ఏ విషయంపైనైనా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అవి తగిన వేదికపై, అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ జరగాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం లక్ష్యంగా ఉక్రెయిన్ డోన్లతో దాడి చేసిందంటూ వచ్చిన వార్తలను ట్రంప్ ఖండించారు. దీనిపై రష్యా చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. అలాంటి లక్ష్యంతో దాడి జరగలేదని తమ అధికారులు ధ్రువీకరించినట్టు చెప్పారు.
ప్రపంచ శాంతికి విఘాతం: జిన్‌పింగ్
ప్రపంచం గడిచిన శతాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత కుదుపులకు లోనవుతోందని, అనిశ్చితితో ఉందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. ఏకపక్ష, బెదిరింపు ధోరణి చర్యలు ప్రపంచ శాంతిని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న దేశాల అభివృద్ధి విధానాలను, మార్గాలను పెద్ద, అభివృద్ధి చెందిన దేశాలు గౌరవించాలన్నారు. మదురోను అమెరికా బంధించి తీసుకువెళ్లడంపై జిన్‌పింగ్ ఈ మేరకు స్పందించారు. సోమవారం ఆయన ఐర్లాండ్ ప్రధాని మిచెల్ మార్టిన్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా జెండా రంగులతో గ్రీన్‌లాండ్ మ్యాప్
అమెరికా జెండా రంగులతో గ్రీన్‌లాండ్ చిత్రపటాన్ని రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. డెన్మార్క్ దేశంలో స్వయంప్రతిపత్తి ప్రాంతంగా కొనసాగుతున్న గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో కలుపుకొంటామంటూ ట్రంప్ చెబుతున్న నేపథ్యంలో ఈ పోస్టుకు ప్రాధాన్యం ఏర్పడింది. ట్రంప్ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న స్టీఫెన్ మిల్లర్ భార్య కాటీ మిల్లర్ శనివారం ఈ పోస్టు పెట్టారు. వెనెజువెలాపై అమెరికా మిలటరీ ఆపరేషన్ చేపట్టిన కొద్ది గంటల్లోనే ఆమె ఈ పోస్టు పెట్టారు. ‘త్వరలో’(సూన్) అని క్యాప్షన్ పెట్టారు. వలసలు, ఇతర అంతర్గత వ్యహారాల్లో స్టీఫెన్ మిల్లర్ అధ్యక్షుడు ట్రంప్‌నకు సలహాదారుగా ఉన్నారు.
జేడీ వాన్స్ ఇంటిపై దాడి
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి జరిగింది. ఒహాయోలోని ఆయన నివాసంపై అర్ధరాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి దాడి చేయడంతో పలుచోట్ల కిటికీలు ధ్వంసమయ్యాయి. అమెరికా సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని భారీగా మోహరించారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో వాన్స్ కుటుంబసభ్యులు ఇంట్లో లేరని అధికారులు ధ్రువీకరించారు. ఇటీవల వెనిజువెలాపై అమెరికా సైనిక ఆపరేషన్ సమయంలో కూడా జేడీ వాన్స్ భద్రతా కారణాల దృష్ట్యా ఫ్లోరిడా వెళ్లకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో వాన్స్ నివాసం చుట్టుపక్కల అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.