Share News

ఇక ఏమాత్రం మంచివాడిని కాను!

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:19 AM

ఇకపై తాను ఏమాత్రం మంచివాడిగా ఉండబోనంటూ ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. అణు కార్యక్రమాన్ని వదులుకుని ఒప్పందం కుదుర్చుకోవడం ఎలాగో..

ఇక ఏమాత్రం మంచివాడిని కాను!

  • ఇరాన్‌ వాళ్లు కాస్త తెలివిగా వ్యవహరిస్తే మంచిది: ట్రంప్‌

  • చేతిలో మెషీన్‌గన్‌ పట్టుకున్న ఏఐ ఫొటోతో పోస్టు

వాషింగ్టన్‌/టెహ్రాన్‌, ఏప్రిల్‌ 29: ఇకపై తాను ఏమాత్రం మంచివాడిగా ఉండబోనంటూ ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. అణు కార్యక్రమాన్ని వదులుకుని ఒప్పందం కుదుర్చుకోవడం ఎలాగో ఇరాన్‌కు తెలియడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా వాళ్లు కాస్త తెలివిగా వ్యవహరిస్తే మంచిదని సూచించారు. ఈ మేరకు తాను యుద్ధ క్షేత్రంలో మెషీన్‌గన్‌ పట్టుకుని నిలబడినట్టుగా కృత్రిమ మేధ(ఏఐ)తో రూపొందించిన ఫొటోను ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ పోస్టు చేశారు. అంతకుముందు జర్మనీ చాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌పై ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. ఇరాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నా ఫర్వాలేదని ఫ్రెడరిక్‌ మెర్జ్‌ భావిస్తున్నారని.. కానీ ప్రపంచం మొత్తం ఇరాన్‌ వద్ద బందీ అవుతుందని పేర్కొన్నారు. ఇరాన్‌ విషయంలో తాను ఇప్పుడు చేస్తున్న పనిని.. ఇతర దేశాలు, అధ్యక్షులు ఎప్పుడో చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. కాగా, అమెరికాతో, ఆ దేశ అధ్యక్షుడితో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని మెర్జ్‌ పేర్కొన్నారు. ఇరాన్‌తో యుద్ధం నుంచి ఎలా బయటపడాలో అమెరికాకు తెలియడం లేదని, అయితే ఆ యుద్ధ పరిణామాలను తాము అనుభవిస్తున్నామని అన్నారు.

అవసరమైతే ప్రాణాలు అర్పిద్దాం: ఇరాన్‌

అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న తరుణంలో యూకేలోని ఇరాన్‌ దౌత్యకార్యాలయం టెలిగ్రామ్‌ ఖాతాలో పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ‘శత్రువుకు లొంగిపోవడానికి బదులు యుద్ధంలో మన ప్రాణాలు అర్పించి, బలిదానం చేద్దాం. అందుకు సిద్ధంగా ఉన్నవారు మమ్మల్ని సంప్రదించాలి’ అని ఇరాన్‌ ఎంబసీ పేర్కొంది. ఇది యూకేలో, యూర్‌పలో ఇరాన్‌ ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ యూకే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది హింసను ప్రోత్సహిస్తున్నట్టు కాదని, దేశంపై తమ ప్రజల విధేయతకు సంబంధించినదని యూకేలోని ఇరాన్‌ ఎంబసీ సమర్థించుకుంది. మరోవైపు, యుద్ధంతో నష్టాలు, అమెరికా దిగ్బంధంతో చమురు విక్రయించుకోలేకపోవడంతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. దీనితో ఇరాన్‌ కరెన్సీ రియాల్‌ విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. ఇరాన్‌ కరెన్సీ విలువ బుధవారం ఒక డాలర్‌కు 18 లక్షల రియాల్స్‌కు పడిపోయింది. నిజానికి యుద్ధం మొదలైన తొలి రోజుల్లో డాలర్‌తో ఇరాన్‌ కరెన్సీ విలువ 14 లక్షల రియాల్స్‌కు పడిపోయినా తర్వాత కోలుకుంది. యుద్ధం కొనసాగినన్ని రోజులు 9-10 లక్షల రియాల్స్‌ మధ్య ఉండిపోయింది. కానీ రెండు, మూడు రోజుల నుంచి మళ్లీ పతనమవుతూ వస్తోంది.


ట్రంప్‌కు యుద్ధంపై నిజాలే చెబుతున్నారా?

  • పెంటగాన్‌ నివేదికలపై వాన్స్‌ సందేహం

ఇరాన్‌పై యుద్ధం విషయంలో అమెరికా అంచనాలు తప్పడంతో అధ్యక్షుడు ట్రంప్‌కు సలహాలు ఇచ్చే అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ పనితీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా ఈ విషయంలో ఆందోళనతో ఉన్నట్టు ‘ద అట్లాంటిక్‌’ ఓ కథనం ప్రచురించింది. యుద్ధ పరిస్థితిపై రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌, జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ డాన్‌ కెయిన్‌ చేస్తున్న ప్రకటనలను అంతర్గత భేటీలో వాన్స్‌ ప్రశ్నించినట్టు తెలిసింది. ఇరాన్‌కు చెందిన త్రివిధ రక్షణ వ్యవస్థలను కోలుకోలేని విధంగా దెబ్బతీశామని, అమెరికా వద్ద ఆయుధ నిల్వలకు ఢోకా లేదంటూ వారు వెల్లడిస్తున్నారు. ట్రంప్‌తో జరిగిన అంతర్గత సమావేశంలో, వారిద్దరి ప్రకటనలపై వాన్స్‌ అనుమానం వ్యక్తం చేసినట్టు సమాచారం. వారు చెబుతున్న విషయాల్లో వాస్తవం ఎంత.. ‘అంతా బాగుంది’ అన్న ప్రకటన సరైనదేనా అంటూ ఆయన నేరుగా వారినే నిలదీసినట్టు సమాచారం. ఈ కథనాన్ని అనుసరించి.. క్షిపణి నిల్వలు కరిగిపోతుండటం పట్ల ట్రంప్‌ ఎదుట వాన్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల చైనా, రష్యా, ఉత్తర కొరియా నుంచి భవిష్యత్తులో రాగల సమస్యలను ఆయన ప్రస్తావించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 05:19 AM