ఇరాన్ మాట తప్పితే.. మళ్లీ బాంబులేస్తాం
ABN , Publish Date - Jun 18 , 2026 | 06:12 AM
ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోతే ఆ దేశంపై మళ్లీ బాంబులు...
ఆ దేశం 47 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది
ఒప్పందానికి ముందు ట్రంప్ వ్యాఖ్యలు
డీల్‌తో హోర్ముజ్‌పై ఇరాన్‌కు గుత్తాధిపత్యం
ట్రంప్ సర్కార్‌కు నిఘా విభాగం హెచ్చరిక
ఇరాన్ పునర్నిర్మాణ ప్యాకేజీ 300 బిలియన్
డాలర్లు.. అవన్నీ ప్రైవేటు పెట్టుబడులే
ప్యారిస్, జూన్ 17: ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండకపోతే ఆ దేశంపై మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. జీ7 సమ్మిట్‌లో భాగంగా బుధవారం ఆయన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్‌తో ఒప్పందం గురించి మాట్లాడారు. ‘అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ఫైనల్ కాదు. అది నాకు నచ్చకపోయినా, వాళ్లు (ఇరాన్) దానికి కట్టుబడి ఉండకపోయినా.. మేము మళ్లీ ఇరాన్‌పై బాంబులు వేస్తాం. ఎందుకంటే ఇరాన్ గత 47 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది’ అని ఆరోపించారు. ఎంవోయూ కోసం ఇరాన్‌కు తాము ఒక్క పైసా కూడా ఇవ్వటం లేదని స్పష్టంచేశారు. 60 రోజుల కాల్పుల విరమణ కోసం ఎంవోయూపై స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ 19న సంతకాలు చేయనున్నాయి.
హోర్ముజ్‌పై ఇరాన్‌కు గుత్తాధిపత్యం..?
ఎంవోయూలో హోర్ముజ్ జలసంధి విషయంలో పొందుపర్చిన నిబంధనలపై అమెరికా నిఘా విభాగం ఆందోళనగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఒప్పందం కారణంగా జలసంధిపై ఇరాన్‌కు గుత్తాధిపత్యం లభిస్తుందని ట్రంప్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు సమాచారం. ‘ఇకపై ఇరాన్ తనకు ఇష్టం వచ్చినప్పుడు జలసంధిని మూసివేయగలదు. నచ్చినట్లు చేసుకోగలదు. జలసంధిపై ఇరాన్‌కు మనం సర్వాధికారాలు కట్టబెడుతున్నాం. ఇది ఆ దేశం అణుబాంబు తయారు చేయటం కన్నా ప్రమాదకరమైనది’ అని పేర్కొన్నట్లు తెలిసింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్‌ఏఐ సంస్థ తయారు చేసిన కృత్రిమ మేధ చాట్‌బాట్ గ్రోక్‌ను ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా మిలిటరీ విరివిగా వినియోగించుకున్నట్లు వెల్లడైంది. గ్రోక్ సాయంతో 96 గంటల్లో ఇరాన్‌లోని 2,000 లక్ష్యాలపై బాంబులు వేసినట్లు అమెరికా న్యాయశాఖ స్వయంగా వెల్లడించింది.
ఆ 300 బిలియన్ డాలర్లు ప్రైవేటు పెట్టుబడులే
ఎంవోయూలో భాగంగా ఇరాన్ పునర్నిర్మాణానికి 300 బిలియన్ డాలర్ల నిధులను పెట్టుబడుల రూపంలో సమకూరుస్తామని అమెరికా హామీ ఇచ్చినట్లు వస్తున్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. తాము ఇరాన్‌లో ఒక్క డాలర్ కూడా పెట్టుబడి పెట్టబోమని స్పష్టంచేశారు. అయితే, తమ మిత్ర దేశాలతో ఇరాన్‌లో ఆ మేరకు పలు రంగాల్లో పెట్టుబుడులు పెట్టించే అవకాశం ఉందని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. స్తంభింపజేసిన ఇరాన్ నిధులను ఆ దేశం ఎలాంటి షరతులు లేకుండా వాడుకొనే అవకాశం కల్పించటం కూడా అందులో భాగమేనని పేర్కొన్నాయి. కాగా, ఈ నిధుల్లో దాదాపు 150బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే అవగాహన ఒప్పందాలు కుదిరాయని రాయిటర్స్ వెల్లడించింది. ఈ పెట్టుబడులన్నీ ప్రైవేటు రంగం నుంచే రానున్నాయని, తుది ఒప్పందం కుదిరిన తర్వాతే ఈ పెట్టుబడులు ఆచరణలోకి వస్తాయని తెలిపింది.
ఇవీ చదవండి:
సైబర్ నేరస్థులు 'పరాన్నజీవులు'.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్