Share News

చైనా మిమ్మల్ని తినేస్తుంది.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:39 AM

గోల్డెన్ డోమ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చైనాకు దగ్గరవుతున్న కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా భగ్గుమన్నారు. చైనా కెనడాను తినేస్తుందని హెచ్చరించారు.

చైనా మిమ్మల్ని తినేస్తుంది.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక
Donald Trump Fumes at Canada

ఇంటర్నెట్ డెస్క్: మిసైల్ రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్‌ ఏర్పాటు ప్రతిపాదనలను కెనడా వ్యతిరేకిస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదోక రోజు కెనడా చైనాకు బలైపోతుందని వ్యాఖ్యానించారు. చైనాతో దౌత్య, వాణిజ్య బంధాల బలోపేతానికి కెనడా ప్రయత్నిస్తున్న తరుణంలో ట్రంప్ ఈ హెచ్చరిక చేశారు.

‘గ్రీన్‌లాండ్‌కు రక్షణగా గోోల్డెన్ డోమ్ ఏర్పాటును కెనడా వ్యతిరేకిస్తోంది. కెనడాకూ ఈ వ్యవస్థతో రక్షణ లభించే అవకాశం ఉన్నా అడ్డుకుంటోంది. ఇది చాలదన్నట్టు వారు చైనాతో వాణిజ్యానికి మొగ్గుచూపుతున్నారు. ఒప్పందం కుదిరిన మొదటి సంవత్సరంలోనే వారు చైనాకు ఆహారమైపోతారు’ అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ హెచ్చరించారు.

కెనడా, అమెరికాల మధ్య కొంత కాలంగా అసలేమాత్రం పొసగని విషయం తెలిసిందే. ఇక దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో ఇరు దేశాల మధ్య ఎడం మరింత పెరిగింది. ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వ తీరును కెనడా ప్రధాని కార్నీ ఎండగట్టారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో చట్టబద్ధ నియమాలకు కాలం చెల్లినట్టు కనిపిస్తోందని అన్నారు.

దీంతో, ట్రంప్ కూడా అంతేఘాటుగా స్పందించారు. ఇంతకాలం అమెరికా ఇచ్చే అనేక ఉచితాలను అనుభవించిన కెనడా కాస్తంత కృతజ్ఞతతో మసులుకోవాలని అన్నారు. కానీ వారిలో కృతజ్ఞత కనిపించట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తను ప్రతిపాదించిన గోల్డెన్ డోమ్‌తో కెనడాకు కూడా రక్షణ లభిస్తుందని అన్నారు.


ఏమిటీ గోల్డెన్‌డోమ్ ప్రాజెక్టు..

మిసైల్ దాడుల నుంచి రక్షణ కోసం అమెరికా ప్రభుత్వం గతేడాది తొలిసారిగా ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరోన్ డోమ్ వ్యవస్థ స్ఫూర్తితో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. మొదట్లో దీన్ని ఐరన్ డోమ్ ఆఫ్ అమెరికాగా మీడియాలో పేర్కొన్నప్పటికీ ఆ తరువాత ప్రభుత్వం గోల్డెన్ డోమ్‌గా పేరు మార్చింది. ఇందుకు అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని కెనడా ప్రభుత్వం భరిస్తే ఆ దేశానికి రక్షణ కల్పిస్తామని తెలిపింది. అమెరికా భద్రతకు గ్రీన్‌లాండ్ కీలకంగా మారిందని చెబుతున్న ట్రంప్ అక్కడకు కూడా గోల్డెన్ డోమ్ రక్షణను విస్తరిస్తామని చెబుతున్నారు.

అయితే, కెనడా మాత్రం ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. గోల్డెన్ డోమ్ ప్రతిపాదన తమ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు కూడా కెనడా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.


ఇవీ చదవండి:

అందుకే నా చేతికి గాయం అయ్యింది: డొనాల్డ్ ట్రంప్

పాక్‌లో దారుణం.. పెళ్లింట ఆత్మాహుతి దాడి

Updated Date - Jan 24 , 2026 | 11:51 AM