Share News

అందుకే నా చేతికి గాయం అయ్యింది: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Jan 24 , 2026 | 08:56 AM

శాంతి మండలి సమావేశాల సందర్భంగా తన ఎడమ చేతికి టేబుల్ తగలడంతో స్వల్ప గాయమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చేతికి గాయంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.

అందుకే నా చేతికి గాయం అయ్యింది: డొనాల్డ్ ట్రంప్
Donald Trump Left Hand Bruise

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిపై మరోసారి స్వల్ప గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఈ అంశంపై ట్రంప్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. దావోస్‌లో (స్విట్జర్‌లాండ్‌) జరిగిన శాంతి మండలి సమావేశాల్లో ఈ గాయమైందని అన్నారు. సమావేశాల సందర్భంగా తన ఎడమ చేతికి టేబుల్ తగలడంతో చేయిపై కందిపోయినట్టు కనిపించిందని అన్నారు. ఆస్పిరిన్ ఔషధాన్ని వాడుతుండటం కూడా ఇందుకో కారణమని వివరించారు.

‘చేతికి టేబుల్ తగిలింది. దీంతో, కాస్త ఎర్రబడినట్టు అయ్యింది. వెంటనే క్రీమ్ అప్లై చేశాను’ అని చెప్పారు. ఆస్పిరిన్ అధికంగా వాడటం కూడా ఇలా చర్మం కందిపోయినట్టు మారడానికి కారణమని చెప్పారు.

‘గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఆస్పిరిన్ తీసుకోవాలి. అయితే, ఇలా చర్మంపై అక్కడక్కడ కందిపోయినట్టు ఉండొద్దనుకుంటే మాత్రం ఆస్పిరిన్ వద్దు. నేను ఈ ఔషధాన్ని కాస్త ఎక్కువ డోసులోనే తీసుకుంటాను. నాకు ఆస్పిరిన్ అవసరం లేదని, ఆరోగ్యంగా ఉన్నానని డాక్టర్లు చెబుతుంటారు. నేనైతే ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడను’ అని ట్రంప్ తన అధికారిక ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో పేర్కొన్నారు.


ట్రంప్ చేతికి గాయంపై శ్వేత సౌధం కూడా స్పందించింది. చేతికి టేబుల్ తగలడంతో చర్మం కాస్త కందిపోయినట్టుగా మారిందని చెప్పింది. మరుసటి రోజు ఉదయానికే పూర్తిగా తగ్గిపోయిందని చెప్పింది.

మీడియా కథనాల ప్రకారం, శాంతిమండలి సమావేశం మొదట్లో ట్రంప్ చేతిపై ఎలాంటి గాయాలు లేవు. ఆ తరువాత కొన్ని నిమిషాలకు గాయం కనిపించింది. ముఖ్యంగా దస్త్రాలపై సంతకాలు చేస్తున్న సమయంలో ట్రంప్ చేతిపై గాయం మీడియా కంట పడింది.

డాక్టర్ సూచించిన దానికంటే కాస్త ఎక్కువ మొత్తంలోనే తాను ఆస్పిరిన్ టాబ్లెట్స్ వేసుకుంటానని ట్రంప్ గతంలో కూడా పలుమార్లు చెప్పారు. రక్తం పలుచబడేందుకు, గుండె ఆరోగ్యానికి ఆస్పిరిన్ మంచిదని చెప్పుకొచ్చారు. ట్రంప్ రోజుకు 325 మిల్లీగ్రాముల ఆస్పిరిన్ తీసుకుంటారని, దీని వల్ల చర్మంపై తరచూ కందిపోయినట్టు ఎర్రని మచ్చలు కనిపిస్తాయని ఆయన డాక్టర్ ఓ సందర్భంలో తెలిపారు.


ఇవీ చదవండి:

అమెరికాకు ఇరాన్ హెచ్చరిక.. మాపై దాడి చేస్తే..

ఇరాన్‌ వైపు అమెరికా సేనలు

Updated Date - Jan 24 , 2026 | 10:30 AM