Share News

మాట వినకుంటే.. ఒమాన్‌ను ధ్వంసం చేస్తాం

ABN , Publish Date - Aug 18 , 2026 | 06:34 AM

ఇరాన్‌తో యుద్ధం విషయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. తన మిత్రదేశాలపై కూడా బెదిరింపులకు దిగారు. హోర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రవాణాను...

మాట వినకుంటే.. ఒమాన్‌ను ధ్వంసం చేస్తాం

హోర్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌తో ఆ దేశం అంటకాగొద్దు: ట్రంప్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 17: ఇరాన్‌తో యుద్ధం విషయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. తన మిత్రదేశాలపై కూడా బెదిరింపులకు దిగారు. హోర్ముజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకల రవాణాను పునరుద్ధరించే విషయంలో తమకు సహకరించకుంటే ఒమాన్‌పై బాంబులు వేసి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఒమాన్‌తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే, హోర్ముజ్‌ జలసంధిని సంయుక్తంగా నిర్వహించే అంశంపై ఆ దేశం ఇరాన్‌తో చర్చలు జరుపుతోంది. దీనిని ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు. సోమవారం ఫాక్స్‌న్యూ్‌సకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఒమాన్‌పై నిప్పులు చెరిగారు. అమెరికాలో మిడ్‌ టర్మ్‌ ఎన్నికలు ఉన్నాయన్న కారణంతో ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలన్న తొందర తనకు ఏమీ లేదని వ్యాఖ్యానించారు. కాగా, ఇరాన్‌, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సోమవారంతో ముగిసింది.

ఇరాన్‌పై అణుదాడి కోసం ట్రంప్‌ చర్చలు!

యుద్ధంలో ఇరాన్‌ ఎంతకూ లొంగకపోవటంతో ఆ దేశంపై అణ్వాయుధ దాడి చేసే అంశంపై తన యంత్రాంగంతో ట్రంప్‌ చర్చలు జరిపారని అమెరికా కాంగ్రెస్‌ సభ్యురాలు మర్జోరీ టేలర్‌ గ్రీన్‌ ఆరోపించారు. ట్రంప్‌ ప్రభుత్వంలోని వ్యక్తులే తనకు ఈ విషయం చెప్పారని ఆదివారం వెల్లడించారు. ఇదిలా ఉండగా, దక్షిణ కొరియాతో ప్రతీ ఏటా నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను రద్దు చేసుకోవాలని తన మిలిటరీకి ఆదేశాలిచ్చినట్లు ట్రంప్‌ ఆదివారం ట్రూత్‌ సోషల్‌ ద్వారా ప్రకటించారు. ఇరాన్‌ను అణు నిరాయుధీకరణ చేయటానికి సహాయం చేయాలని కోరితే దక్షిణ కొరియా తిరస్కరించిందని, అలాంటి దేశానికి తాము సహాయంగా నిలవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.

హోర్ముజ్‌పై ఒమాన్‌తో ఒప్పందం: ఇరాన్‌

హోర్ముజ్‌ జలసంధిని సంయుక్తంగా నిర్వహించే అంశంపై ఒమాన్‌తో ఒక ఒప్పందం కుదిరిందని ఇరాన్‌ సోమవారం ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం పర్షియన్‌ గల్ఫ్‌లోకి ప్రవేశించే నౌకలు ఇరాన్‌ తీరం వెంట ఉన్న మార్గంలో వెళ్తాయని, బయటకు వచ్చేటప్పుడు ఒమన్‌ తీరం వెంట వస్తాయని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘే తెలిపారు. ఇరాన్‌తో అమెరికా యుద్ధం మొదలుపెట్టడానికి ముందు నౌకలు ఈ రెండు మార్గాల్లో వెళ్లి, రెండు మార్గాల్లోనూ బయటకు వచ్చేవి.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 06:34 AM