Share News

బీబీతో వ్యవహారం కష్టమే: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:28 AM

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో వ్యవహారం చాలా కష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. డీల్‌కు కొన్ని గంటల ముందు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ముప్పు తలెత్తిందని అన్నారు. ఆ తరువాత తేరుకుని డీల్ కుదుర్చుకునేందుకు కొంత సమయం కూడా పట్టిందని చెప్పారు.

బీబీతో వ్యవహారం కష్టమే: డొనాల్డ్ ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో (బీబీ) వ్యవహారం చాలా కష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఒక దశలో ఇరాన్‌తో డీల్ కుప్పకూలే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. వెంట్రుక వాసిలో ఆ ముప్పు తప్పిపోయిందని అన్నారు. ఇరాన్‌తో డీల్‌కు కొన్ని గంటల ముందే బీబీ ఆదేశంతో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై దాడులు చేసిందని చెప్పారు. దీంతో, ఇరాన్‌తో డీల్ ఇబ్బందుల్లో పడే పరిస్థితి తలెత్తిందని అన్నారు.

దాడులపై ఇరాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో డీల్ కుదుర్చుకోవడంలో మళ్లీ జాప్యం జరిగిందని ట్రంప్ తెలిపారు. చివరకు కొన్ని గంటల ఆలస్యంగా ఒప్పందం కుదిరిందని చెప్పారు. ‘ఆయనతో (నెతన్యాహు) వ్యవహారం చాలా కష్టం. వాస్తవానికి ఆయన యూఎస్‌పై కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే.. ఇరాన్ చేతికి అణ్వాయుధం దక్కి ఉంటే ఇజ్రాయెల్ రెండు గంటల్లో భూమ్మీద నుంచి తుడిచిపెట్టుకుపోయేది’ అని వ్యాఖ్యానించారు.


తాజాగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, ఇరాన్, అమెరికాలు అన్ని రకాల మిలిటరీ చర్యలకు తక్షణం ఫుల్ స్టాప్ పెట్టాయి. అయితే, జూన్ 19న ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేయనున్నాయి. యుద్ధ చర్యలకు ఇది శాశ్వత ముగింపు అని కూడా ఇరు దేశాలు స్పష్టంగా ప్రకటించాయి. సంతకాల సందర్భంగా హోర్ముజ్ జలసంధికి సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడతాయి. ప్రస్తుత ఇరాన్ పాలకులు ప్రాప్తకాలజ్ఞతతో ఉన్నారని కూడా ట్రంప్ ఈ సందర్భంగా కితాబునిచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇజ్రాయెల్‌తో ఒప్పందంపై నిరసన.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వాకౌట్

శాంతి ఒప్పందాన్ని ధ్రువీకరించిన ఇరాన్..

Updated Date - Jun 15 , 2026 | 12:07 PM