ఆయుధాలు వదిలేసిన వారికి రక్షణ కల్పిస్తాం.. ట్రంప్ ఆఫర్
ABN , Publish Date - Mar 02 , 2026 | 10:49 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ), మిలిటరీ దళాలకు ఆఫర్ ఇచ్చారు. ఆయుధాలు వదిలేసిన వారికి రక్షణ కల్పిస్తామన్నారు.
న్యూయార్క్, మార్చి 2: సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఇరాన్ ముందుకు సాగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు దిగుతోంది. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు చెందిన 506 డ్రోన్లు, 152 మిస్సైల్స్‌ను యూఏఈ కూల్చేసింది. కువైట్‌పై ఇరాన్ 97 మిస్సైల్స్, 283 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా.. 30 మందికి గాయాలు అయ్యాయి. ఇరాన్ ప్రయోగించిన 45 మిస్సైల్స్, 9 డ్రోన్లను బహ్రెయిన్ కూల్చేసింది.
ఇరాన్ ఐఆర్‌జీసీ, మిలిటరీ దళాలకు ట్రంప్ ఆఫర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ), మిలిటరీ దళాలకు ఆఫర్ ఇచ్చారు. ఆయుధాలు వదిలేసిన వారికి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. లేకపోతే చావు తప్పదని ఆయన హెచ్చరించారు. యుద్ధం నాలుగు వారాలపాటు జరగొచ్చని అన్నారు. తమ దళాలు జరిపిన దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారని ఆయన వెల్లడించారు. ఇరాన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కాగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ)కు చెందిన ప్రధాన కార్యాలయంపై యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు చేసింది. ఈ దాడుల్లో కార్యాలయం ధ్వంసం అయినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గత 47 ఏళ్లలో ఐఆర్‌జీసీ దళాలు వెయ్యి మందికిపైగా అమెరికన్లను హతమార్చాయని ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేశామని తెలిపింది. ఇరాన్‌కు చెందిన యుద్ధవిమానాలను కూడా ధ్వంసం చేశామని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
టీ20 డబ్ల్యూసీ: సంజుపై టీమిండియా కోచ్ గంభీర్ కీలక కామెంట్స్
రాజధాని నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం