Share News

మాట వినాలి.. లేకపోతే చంపేస్తాం.. మొజ్తాబాకు ట్రంప్ వార్నింగ్

ABN , Publish Date - Mar 12 , 2026 | 07:54 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొజ్తాబాను కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త సుప్రీం లీడర్ అమెరికా అనుమతి తీసుకోవాలని, లేదంటే ఎక్కువ రోజులు ఆ పదవిలో ఉండరని ట్రంప్ స్పష్టం చేశారు.

మాట వినాలి.. లేకపోతే చంపేస్తాం.. మొజ్తాబాకు ట్రంప్ వార్నింగ్
Iran Israel war news

న్యూయార్క్, మార్చి 12: దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొజ్తాబాను కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త సుప్రీం లీడర్ అమెరికా అనుమతి తీసుకోవాలని, లేదంటే ఎక్కువ రోజులు ఆ పదవిలో ఉండరని ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా, మరోసారి ఆయన మొజ్తాబాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అమెరికా డిమాండ్లకు ఒప్పుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు.


న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్‌ను ఇరాన్ పూర్తిగా ఆపేయాలన్నారు. అలా జరగని పక్షంలో చావు తప్పదని హెచ్చరించారు. ఫిబ్రవరి 28వ తేదీ లాంటి దాడులు మరోసారి జరుగుతాయని చెప్పారు. ఇజ్రాయెల్ సాయంతో మొజ్తాబాను చంపేస్తామని అన్నారు. కాగా, ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై భీకర బాంబు దాడులు చేశాయి. టెహ్రాన్‌లోని 30 ప్రాంతాల్లో.. ఇరాన్ నాయకులే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు భార్య, కోడలు, మనవడు కూడా ప్రాణాలు కోల్పోయారు.


అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ గత ఆదివారం ఆయతుల్లా సయ్యద్ మొజ్తాబా హుస్సేనీ ఖమేనీని సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 కింద మొజ్తాబాను ఇరాన్‌కు మూడవ నాయకుడిగా ఎన్నుకున్నట్లు ఇరాన్ పేర్కొంది. దివంగత సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీకి మొజ్తాబా రెండవ కుమారుడు. తండ్రి సుప్రీం లీడర్ కావటంతో మొజ్తాబాకు రెవల్యూషనరీ గార్డ్స్‌తో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆయన గుప్పిట్లోనే ఉండేదన్న విమర్శలు ఉన్నాయి. మొజ్తాబాను సుప్రీం లీడర్ చేయటం ఆయతుల్లా అలీ ఖమేనీని ఇష్టం లేదని, బతికున్న సమయంలో ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారని 'న్యూయార్క్ పోస్ట్' పేర్కొంది.


ఇవి కూడా చదవండి

పెరిగిన పచ్చిమిర్చి, బెండ.. తగ్గిన టమోటా, వంకాయ

ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 12 , 2026 | 08:41 AM