Share News

ఇరాన్‌పై సైనిక చర్య‌ను ప్రారంభించాము.. మా లక్ష్యం అదే: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Feb 28 , 2026 | 02:31 PM

ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై సంయుక్త దాడులకు దిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని మండిపడ్డారు.

ఇరాన్‌పై సైనిక చర్య‌ను ప్రారంభించాము.. మా లక్ష్యం అదే: డొనాల్డ్ ట్రంప్
Trump Iran Israel war statement

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ శనివారం క్షిపణి దాడులు ప్రారంభించిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో తామూ పాల్గొంటున్నట్టు ధ్రువీకరించారు. ఇజ్రాయెల్‌తో కలిసి సంయుక్తంగా సైనిక చర్యను ప్రారంభించామని అన్నారు. ఇరాన్‌ పాలకులతో ఎదురవుతున్న ముప్పును తప్పించడమే తమ లక్ష్యమని అన్నారు. ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఇరాన్‌ సైన్యానికి కీలక హెచ్చరికలు చేశారు.

ఇరాన్ సైన్యంతో పాటు పోలీసులు, ఇతర సాయుధ దళాలు తమ ఆయుధాలను త్యజించాలని స్పష్టం చేశారు. చెప్పినట్టు చేస్తే తాము మానవత్వంతో నడుచుకుంటామని అన్నారు. లేని పక్షంలో మరణం తప్పదని హెచ్చరించారు. ఇరాన్‌లోని పాలనను హస్తగతం చేసుకోవాలని ప్రజలకూ పిలుపునిచ్చారు. స్వేచ్ఛావాయులు పీల్చుకునే అవకాశం వారి ముందు ఉందని కామెంట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఇరాన్ ఎగదోస్తోందని ట్రంప్ మండిపడ్డారు. తమ పౌరులను ఇటీవలే వేల సంఖ్యలో ఇరాన్ పాలక వర్గం అంతమొందించిందని అన్నారు. ఉగ్రవాద పాలకుల చేతికి అణ్వాయుధం చిక్కకూడదన్నదే అమెరికా విధానమని స్పష్టం చేశారు. వాళ్లకు ఎప్పటికీ అణ్వాయుధాలు దక్కనీయనని స్పష్టం చేశారు.


అణ్వాయుధాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నించొద్దని గతంలో ఇరాన్‌కు పదే పదే చెప్పామని గుర్తు చేశారు. ఈ విషయంలో ఒప్పందం కుదుర్చుకునేందుకూ ప్రయత్నించామని గుర్తు చేశారు. ఇరాన్ తన అణులక్ష్యాలను వదులుకునేందుకు నిరాకరించిందని అన్నారు. అణు కార్యక్రమాన్ని పునర్ నిర్మించేందుకు, దీర్ఘ శ్రేణి మిసైల్స్‌ను సమకూర్చుకునేందుకు రంగంలోకి దిగిందని అన్నారు. ఐరోపా దేశాలు, ఆ ప్రాంతంలోని అమెరికా సైన్యంతో పాటు అమెరికా ప్రధాన భూభాగంలోని వారికి కూడా ముప్పుగా మారిందని మండిపడ్డారు. ఇక ఈ సైనిక చర్యలో భాగంగా అమెరికా సిబ్బందికి ఉన్న రిస్క్‌ను తగ్గించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని అన్నారు. ఈ ఆపరేషన్ కొన్ని రోజుల పాటు సాగే అవకాశం కూడా ఉందని అన్నారు.


ఈ వార్తలూ చదవండి:

ఇరాన్‌పై దాడులు.. దద్దరిల్లిన రాజధాని

క్యూబాను స్నేహపూర్వకంగానే టేకోవర్ చేస్తామేమో.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య

Updated Date - Feb 28 , 2026 | 03:13 PM