క్యూబాను స్నేహపూర్వకంగానే టేకోవర్ చేస్తామేమో.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:44 PM
క్యూబా ఆర్థికంగా అధోగతిలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ దేశ వ్యవహారాలను స్నేహపూర్వకంగానే టేకోవర్ చేయాల్సి రావొచ్చని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: వెనెజువెలాను తన ఆధీనంలోకి తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా క్యూబాపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్యూబాను కూడా తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని అన్నారు. స్నేహపూర్వక రీతిలోనే క్యూబాను ఆధీనంలోకి తీసుకోవాల్సి రావొచ్చని కామెంట్ చేశారు. శ్వేత సౌధం వద్ద తాజాగా విలేకరులతో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు.
క్యూబాతో ప్రస్తుతం ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్వయంగా చర్చలకు నేతృత్వం వహిస్తున్నారని అన్నారు. ‘క్యూబా ప్రభుత్వం మాతో చర్చలు జరుపుతోంది. వారి వద్ద పైసా కూడా లేదు. అసలేమీ లేదు. మనం క్యూబాను స్నేహపూర్వకంగానే టేకోవర్ చేయొచ్చేమో’ అని అన్నారు. ఇందుకు ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేమని కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పరిస్థితులు కీలక మలుపులో నిలిచాయనే సంకేతాలను ఇచ్చారు.
ఇటీవల అమెరికా నుంచి నావలో బయలుదేరిన కొందరు సాయుధులు, క్యూబా సైన్యం మధ్య కాల్పులు జరిగిన ఘటన వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. బోట్‌లో ఉన్నది క్యూబా దేశస్థులని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఈ ఘటన అసాధారణమైనదని విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు.
జనవరిలో వెనెజువెలా వ్యవహారాలను తన ఆధీనంలోకి తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆ తరువాత క్యూబాపై దృష్టి సారించారు. వెనెజువెలా నుంచి చమురు దిగుమతులు నిలిచిపోయాక క్యూబా ఆర్థికంగా అధోగతికి చేరుకుందని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా జోక్యం చేసుకోకపోతే క్యూబా కుప్పకూలిపోవచ్చని కూడా అన్నారు.
ఈ వార్తలూ చదవండి:
ఇరాన్‌పై దాడులు.. దద్దరిల్లిన రాజధాని
నేను జోక్యం చేసుకునేవాణ్ణే కానీ.. అఫ్గాన్-పాక్ ఘర్షణలపై ట్రంప్ కామెంట్