హోర్ముజ్.. అమెరికా కొత్త భూభాగం!
ABN , Publish Date - Aug 19 , 2026 | 06:18 AM
హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామంటూ తరచూ ప్రకటనలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా ఆ జలసంధి అమెరికాలో కలిసిన కొత్త భూభాగమని పేర్కొన్నారు...
జలసంధి తమదేనంటూ ట్రూత్ సోషల్‌లో
మ్యాప్‌ను పోస్టు చేసిన ట్రంప్
ఇరాన్‌తో చర్చలు జరగడం లేదని వెల్లడి
యుద్ధంలో విజయం సాధించింది మేమే
చర్చల కోసం అమెరికా అడుక్కుంటోంది
హోర్ముజ్‌పై ట్రంప్ భ్రమలను తొలగిస్తాం
దిగ్బంధం, ఆంక్షలు ఎత్తివేసేదాకా
జలసంధిని తెరిచే ప్రసక్తే లేదు: ఇరాన్
వాషింగ్టన్, ఆగస్టు 18: హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామంటూ తరచూ ప్రకటనలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా ఆ జలసంధి అమెరికాలో కలిసిన కొత్త భూభాగమని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధికి సంబంధించిన మ్యాప్‌ను మంగళవారం ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అయితే ఇరాన్‌తో మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుగుతున్నాయని గతవారం చెప్పిన ట్రంప్.. అందుకు విరుద్ధంగా మరోపోస్టు పెట్టారు. ‘‘ఇరాన్‌తో ఎలాంటి చర్చలుగానీ, సంప్రదింపులుగానీ జరపడం లేదు. చర్చల కోసం ఎలాంటి షెడ్యూల్ కూడా లేదు. ఇరాన్ నౌకల దిగ్బంధం పూర్తిస్థాయిలో కొనసాగుతోంది. మిగతా దేశాల నౌకలకు సంబంధించి హోర్ముజ్ జలసంధి తెరిచే ఉంది. నౌకా రవాణా కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో సముద్ర మందుపాతరల (సీమైన్ల)ను తొలగించాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, అమెరికాతో జరిగిన యుద్ధంలో, దౌత్యంలో తామే గెలిచామని, శత్రువు తమ షరతులకు తలొగ్గేలా చేయగలిగామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. అమెరికా చర్చల కోసం తమను అడుక్కుంటోందని, ఇరాన్ షరతుల మేరకు చర్చలకు సిద్ధమని చెబుతోందని తెలిపారు. అమెరికాతో గతంలో కుదిరిన అవగాహన ఒప్పందంలో 13 అంశాలు ఇరాన్‌కు అనుకూలంగా ఉంటే.. ఒక్కటి మాత్రమే అమెరికాకు అనుకూలంగా ఉందని చెప్పారు. ఆ ఒప్పందం అమలుకాకుండా ఇజ్రాయెల్ చేయగలిగినంతా చేసిందని ఆరోపించారు. ఇక అమెరికా నౌకా దిగ్బంధాన్ని, ఇరాన్ చమురు విక్రయాలపై ఆంక్షలను ఎత్తివేసేదాకా హోర్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఘలీబఫ్ మరోసారి స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి విషయంలో ట్రంప్ భ్రమల్లో ఉన్నారని, త్వరలోనే ఆ భ్రమలు తొలగిపోతాయని ఇరాన్ విదేశాంగశాఖ ఉప మంత్రి ఘరిబాబాదీ వ్యాఖ్యానించారు. లేకపోతే ట్రంప్ భ్రమలను తామే తొలగిస్తామన్నారు.
మరో నౌకపై దాడి
హోర్ముజ్ జలసంధిలో ఒమన్ తీరానికి సమీపంగా ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. గ్రీకు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌక ఇంజన్ రూమ్‌లో మంటలు చెలరేగాయని, నౌక ఇంజనీర్ ఒకరు మరణించారు. మిగతా సిబ్బందిని రక్షించామని ఒమన్ తీరప్రాంత గస్తీదళం వెల్లడించింది. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రాలేదు.
ఈ వార్తలనూ చదవండి:
ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం