'నా పనిని మరింత కష్టం చేశారు.. శత్రువుకు కొమ్ముకాస్తున్నారు'.. ట్రంప్ ఆగ్రహం
ABN , Publish Date - Jun 24 , 2026 | 10:32 AM
ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో తన సైనిక అధికారాలకు కత్తెర వేస్తూ అమెరికా సెనేట్ తీర్మానం ఆమోదించడంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది.. తన పనిని మరింత కష్టం చేసిందని, ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాద స్పాన్సర్ అయిన ఇరాన్‌కు సహాయం, ఓదార్పు అందించినట్లైందని విమర్శించారు.
వాషింగ్టన్ డీసీ, జూన్ 24: ఇరాన్‌తో ఘర్షణల నేపథ్యంలో తన సైనిక అధికారాలకు కత్తెర వేస్తూ అమెరికా సెనేట్ తీర్మానం ఆమోదించడంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సెనేటర్లు తీసుకున్న ఈ నిర్ణయం తన పనిని మరింత కష్టతరం చేసిందని, అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాద స్పాన్సర్ అయిన ఇరాన్‌కు సహాయం, ఓదార్పు అందించినట్లు అయిందని ఆయన మండిపడ్డారు. సెనేట్ ఓటింగ్‌లో తన సొంత పార్టీకి చెందిన నలుగురు సెనేటర్లు డెమోక్రాట్లతో చేతులు కలపడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
'ఇరాన్ లొంగిపోయే స్థితిలో ఉంటే.. వీళ్లు అడ్డుపడ్డారు'
తన 'ట్రూత్ సోషల్' ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ వరుస పోస్ట్‌లు పెడుతూ సెనేట్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 'చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ ప్రస్తుతం పూర్తిగా బలహీనపడింది. అమెరికా అడిగిన ప్రతిదానికీ ఒప్పుకునే స్థితికి వచ్చింది. దశాబ్దాల తర్వాత అమెరికాను, దేశ అధ్యక్షుడైన నన్ను చూసి ఇరాన్ గజగజలాడుతోంది. ఇలాంటి కీలక సమయంలో యూఎస్ సెనేట్ ఏమాత్రం సమయం కాని సమయంలో, అర్థం లేని 'వార్ పవర్స్ యాక్ట్' ఓటింగ్ పెట్టింది' అని ట్రంప్ విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడో తమకు నచ్చడం లేదని, ఆయనను ఆపాలని శత్రుదేశానికి పార్లమెంటే చెబుతున్నట్లుగా ఈ తీర్మానం ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఓటింగ్ ఫలితం చూసి 'దీని అర్థం ఏంటి?' అని ఇరాన్ ప్రతినిధులు తన అధికారులను అడుగుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
సొంత పార్టీ నేతలపై 'రిపబ్లికన్ లూజర్స్' అంటూ ఫైర్
సెనేట్‌లో ఈ తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. డెమోక్రాట్లకు మద్దతుగా ఓటు వేసిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు రాండ్ పాల్, సుసాన్ కాలిన్స్, లిసా ముర్కోవ్‌స్కీ, బిల్ కాసిడీలను ట్రంప్ 'రిపబ్లికన్ లూజర్స్ ' అని సంబోధించారు. డెమోక్రాట్లతో కలిసి వారు చేసిన ఈ పని వల్ల తన విదేశాంగ విధానానికి ఆటంకం కలిగిందని, అయినప్పటికీ తాను అనుకున్నది ఏ రకంగానైనా సాధించి తీరుతానని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) ముందస్తు అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదని, అక్కడ ఉన్న అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ సెనేట్ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అంతకుముందే ప్రతినిధుల సభ (House) లో కూడా ఇది 215-208 ఓట్లతో పాస్ అయింది.
అయితే, వైట్ హౌస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇది 'కాంకరెంట్ రిజల్యూషన్' (రెండు సభల ఉమ్మడి తీర్మానం) కావడంతో దీనికి అధ్యక్షుడి సంతకం అవసరం లేదు, అలాగని దీనికి పూర్తి స్థాయి చట్టపరమైన బలం కూడా ఉండదు. పైగా, గత ఏప్రిల్ 7 నాటి కాల్పుల విరమణతోనే ఇరాన్‌తో ఘర్షణలు ముగిశాయని, ప్రస్తుతం అక్కడ ఎలాంటి యుద్ధ వాతావరణం లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
చట్టబద్ధత లేనప్పటికీ, అధ్యక్షుడి సైనిక నిర్ణయాలపై కాంగ్రెస్ తన అసమ్మతిని తెలపడానికి, ట్రంప్ దూకుడుకు బ్రేకులు వేయడానికి డెమోక్రాట్లు, కొందరు రిపబ్లికన్లు కలిసి ఆడిన రాజకీయ చదరంగంలో ఈ తీర్మానం ఒక మైలురాయిగా నిలిచిందనే కథనాలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి.
