భారత నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడికి యత్నించింది: డొనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Jun 13 , 2026 | 07:10 AM
హోర్ముజ్ జలసంధి గుండా వెళుతున్న భారత నౌకలపై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ చర్యలను సోషల్ మీడియా వేదికగా ఆయన తప్పుబట్టారు.
ఇంటర్‌నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధి గుండా వెళుతున్న భారత నౌకలపై ఇరాన్ డ్రోన్‌తో దాడి చేసేందుకు ప్రయత్నించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ చర్యలను సోషల్ మీడియా వేదికగా ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు శుక్రవారం తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ది ట్రూత్ సోషల్’లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘హోర్ముజ్ జలసంధి నుంచి వెళుతున్న భారతీయ నౌకలపై నిన్న రాత్రి ఇరాన్ డ్రోన్ దాడి చేయడానికి ప్రయత్నించింది. మేము ఆ దాడిని తిప్పికొట్టాము. ఇరాన్ డ్రోన్ దాడికి యత్నించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము’ అని రాసుకొచ్చారు.
అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయుల మృతి..
నాలుగు రోజుల క్రితం ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకలపై అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు సముద్రంలో గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది 21 మందిని రక్షించారు. సముద్రంలో గల్లంతైన ఆ ముగ్గురు భారతీయులు చనిపోయారు. వారిని డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్‌గా గుర్తించారు. ఈ దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. నౌకలపై దాడులను వెంటనే ఆపాలని విదేశాంగ శాఖ కోరింది.
చర్చల దగ్గరే ఆగిపోయిన శాంతి ఒప్పందం..
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించటం లేదు. ఒప్పందం చర్చల స్థాయిలోనే ఆగిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీ రోజూ ఇరాన్‌తో డీల్ గురించి స్పందిస్తున్నారు. రెండు దేశాల మధ్య డీల్ కుదిరిందని అంటున్నారు. గురువారం ఓవల్ ఆఫీస్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. మరికొన్ని రోజుల్లో డీల్ ఒప్పందంపై సంతకాలు చేస్తామని, ఒప్పందంపై సంతకాలు కాగానే హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని అన్నారు. అయితే, అమెరికాతో ఇరాన్ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఇరాన్‌కు చెందిన సెమీ అధికారిక మీడియా ‘ఫార్స్ న్యూస్ ఏజెన్సీ’ తెలిపింది.
ఇవి కూడా చదవండి
రూ.687.78 కోట్ల టెండర్‌ను 2,000 కోట్ల స్కాం అంటారా?
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు 50 వేల జరిమానా