రూ.687.78 కోట్ల టెండర్‌ను 2,000 కోట్ల స్కాం అంటారా?
ABN , Publish Date - Jun 13 , 2026 | 07:05 AM
రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల పిల్లలకు సదుపాయాల కల్పన కోసం చేపట్టిన కొనుగోలు ప్రక్రియపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని..
హరీశ్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.. దోచుకోవడం దాచుకోవడం మీ నైజం
ప్రజాధనంతో ఫామ్‌హౌస్‌లు కట్టుకొని విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించారు
అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్
హైదరాబాద్, జూన్ 12 (హైదరాబాద్): రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల పిల్లలకు సదుపాయాల కల్పన కోసం చేపట్టిన కొనుగోలు ప్రక్రియపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన మొత్తం టెండర్ విలువ కేవలం రూ.687.78 కోట్లు మాత్రమేనని, మరి ఇందులో రూ.2వేల కోట్ల కుంభకోణం అనే అంకె ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని, నిజంగా ఆధారా లు ఉంటే విచారణ సంస్థలకు ఇవ్వాలన్నారు. ఈ టెండర్ ప్రక్రియ అంతా ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ నుంచి జాతీయ స్థాయి పోటీ టెండర్ల ద్వారా పారదర్శకంగా నిర్వహించినట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 27 బిడ్లు రాగా, టెక్నికల్ అర్హతలు, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఎల్1 విధానంలో టెండర్లు ఖరారు చేశామని, ఏ ఒక్క సంస్థకూ నామినేషన్ పద్థతిలో పని ఇవ్వలేదని తెలిపారు.
బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్న గుజరాత్ కాం ట్రాక్టర్ కథలు పూర్తిగా కల్పితమని, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల సంస్థలు పోటీ పడి టెండర్లు దక్కించుకున్నాయని, వాటిలో అసలు గుజరాత్ కంపెనీయే లేదని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన లిడ్‌క్యా్‌ప్‌కు రూ.40.21 లక్షల విలువైన పనులు మాత్ర మే ఇచ్చారని, తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.51 కోట్ల వర్క్ ఆర్డర్‌ను లీడ్‌క్యా్‌పకు ఇచ్చి పెద్దపీట వేసిందని మంత్రి వెల్లడించారు. దోచుకోవడం, దాచుకోవడం బీఆర్‌ఎస్ నేతల నైజం అని, ప్రజాధనంతో ఫామ్‌హౌస్‌లు కట్టుకుని పేద విద్యార్థుల భవిష్యత్తు సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల మొత్తం ఆర్డర్‌ను టీజీఎల్‌ఐపీసీకి, యూనిఫామ్ వస్త్రం, కార్పెట్లు, దు ప్పట్లు, బెడ్డింగ్ సామగ్రిలో గణనీయమైన వాటాను టీజీఎస్‌సీవోకు, నోట్‌బుక్‌ల సరఫరాను తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు అప్పగించామని చెప్పారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 14 వేల మంది మహిళా టైలర్లకు యూనిఫామ్ కుట్టు పను లు అప్పగించినట్లు వివరించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఎన్ని కొత్త హాస్టళ్లు నిర్మించారని ప్రశ్నించారు. డైట్, కాస్మెటిక్ చార్జీల పెంపు గురించి ఎందుకు ఆలోచించలేదని అడ్లూరి నిలదీశారు. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ.. రూ.687.78 కోట్ల టెండర్‌ను రూ.2వేల కోట్ల కుంభకోణంగా చిత్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రీకృత కొనుగోలు విధానం వల్ల వస్తువుల నాణ్యత, పారదర్శకత, సమయానికి సరఫరా సాధ్యమవుతోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని, హరీశ్ రావు వద్ద నిజంగా ఆధారాలు ఉంటే వాటిని వెంటనే బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు.