Share News

సంచలనంగా మారిన అమెరికా అధ్యక్షుడు షేర్ చేసిన ఏఐ చిత్రాలు

ABN , Publish Date - Jul 27 , 2026 | 07:01 AM

అమెరికా అధ్యక్షుడు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వేదికగా షేర్ చేసిన AI చిత్రాలు సంచలనంగా మారాయి. అమెరికా సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు, 'ట్రంప్ 2028' పేరుతో భవిష్యత్ రాజకీయ ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ డిజిటల్ ఆర్ట్ డిజైన్ చేశారు.

సంచలనంగా మారిన అమెరికా అధ్యక్షుడు షేర్ చేసిన ఏఐ చిత్రాలు
Trump Shares AI-Generated Images

వాషింగ్టన్, జులై 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ట్రూత్ సోషల్' వేదికగా షేర్ చేసిన కృత్రిమ మేధ (AI) ద్వారా సృష్టించిన చిత్రాలు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యూఎస్ సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు, 'ట్రంప్ 2028' పేరుతో భవిష్యత్ రాజకీయ ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ డిజిటల్ ఆర్ట్స్ డిజైన్ చేశారు.

Trump-ai.jpg


'గార్డియన్స్ ఆఫ్ ది వరల్డ్' నుంచి సైనిక ఘర్షణల దాకా..

ట్రంప్ షేర్ చేసిన చిత్రాల్లో ప్రధానంగా పశ్చిమాసియాలో సైనిక చర్యలకు సంబంధించిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. 'గార్డియన్స్ ఆఫ్ ది వరల్డ్' (Guardians of the World) అనే టైటిల్‌తో ఉన్న చిత్రంలో, ట్రంప్ వెనుక అమెరికా స్టీల్త్ ఫైటర్ జెట్‌లు ఎగురుతూ, 'IRAN' అనే లేబుల్ ఉన్న లక్ష్యాలపై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

ఇరాన్ ముఖ్యమైన చమురు టెర్మినల్ ఖార్గ్ ఐలాండ్‌పై దాడిని వర్ణించే 'స్ట్రైక్ ఆన్ ఖార్గ్', ఇరాన్ చమురు నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు చూపే 'ఇట్స్ అవర్ ఆయిల్ ట్యాంకర్ నౌ!', వెనుక భాగంలో పేలిపోయిన ఇరాన్ నౌక దృశ్యాలు ఇందులో ఉన్నాయి.

గతంలో వియత్నాం, ఇరాక్ యుద్ధాల్లో వేలాదిమంది ప్రాణాలు పోయాయని, అయితే తన హయాంలో వెనెజువెలా, ఇరాన్ మీద దాడి తక్కువ ప్రాణనష్టంతో ముగిశాయని పోల్చే చార్ట్‌ను కూడా ఆయన పోస్ట్ చేశారు.

Trump-ai-pics.jpg


'ట్రంప్ 2028' సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ బ్రాండింగ్

కేవలం సైనిక శక్తినే కాకుండా తన పొలిటికల్ ఇమేజ్‌ను మరింత బలపరిచేలా అనేక ఫిక్షనల్, సైన్స్-ఫిక్షన్ తరహా డిజిటల్ పోస్టర్లను కూడా ఆయన నెటిజన్లతో పంచుకున్నారు. అమెరికా పితామహులు జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, అలెగ్జాండర్ హామిల్టన్‌లతో పాటు ట్రంప్ నిలబడి ఉన్నట్లు 'అమెరికా ఫస్ట్' నినాదంతో మరో ఇమేజ్ క్రియేట్ చేశారు. రాజ్యాంగపరంగా మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం లేనప్పటికీ, 'TRUMP 2028', 'PLAN TRUSTED' అనే ట్యాగ్‌లైన్‌లతో పోస్టర్లు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఒక వేళ.. ఈ నిబంధనను మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దానికి అమెరికన్ కాంగ్రెస్ (సెనెట్, హౌస్)లో 2/3వ వంతు మెజారిటీ సాధించాలి. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో కనీసం 38 రాష్ట్రాల 3/4వ వంతు ఆమోదం లభించాలి.

Trump-ai-1.jpg


ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 01:56 PM