2 లక్షల వీసాల రద్దు!
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:32 AM
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం సుమారు 2లక్షల మంది విదేశీయులకు చెందిన వ్యాపార, పర్యాటక వీసాలను (బీ1, బీ2) రద్దు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది...
బీ1, బీ2 పర్యాటక, వ్యాపార వీసాలను రద్దు చేసేందుకు ట్రంప్ సర్కారు సన్నాహాలు
2016-26 మధ్య కాలంలో వీసాలు పొంది ఆశ్రయం కోరిన వారిపై ప్రభావం
సామూహిక వీసాల రద్దు
వాషింగ్టన్, ఆగస్టు 25: అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం సుమారు 2లక్షల మంది విదేశీయులకు చెందిన వ్యాపార, పర్యాటక వీసాలను (బీ1, బీ2) రద్దు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాల మీద తాత్కాలిక సందర్శకులుగా అమెరికాలో అడుగుపెట్టి, ఆ తర్వాత అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి ‘ఆశ్రయం’ కోసం దరఖాస్తు చేసుకున్న విదేశీయులు లక్ష్యంగా మరికొద్ది వారాల్లో అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 2016 నుంచి 2026 మధ్యకాలంలో బీ1, బీ2 వీసాలు పొందిన వారు ఈ చర్యల పరిధిలోకి రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇంత పెద్ద సంఖ్యలో వీసాలను ఒకేసారి రద్దు చేస్తే.. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక వీసా రద్దు చర్యగా ఇది నిలవనుంది. వీసా తీసుకునే సమయంలో తాత్కాలికంగానే ఉంటామని చెప్పి.. వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ చట్టాలలోని వెసులుబాటును వాడుకుంటూ శాశ్వతంగా ఉండిపోవాలని చూడడం, చట్టాలను పక్కదారి పట్టించడమేనని విదేశాంగ శాఖ ప్రతినిధి టామ్ పిగాట్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులను గుర్తించే ప్రక్రియలో అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం, స్టేట్ డిపార్ట్‌మెంట్ కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే, వీసాలు రద్దు చేసినంత మాత్రాన వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరించే అవకాశం లేదని తెలుస్తోంది. విచారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు వారి వీసా హోదాను వేరే కేటగిరీలోకి మారుస్తారని అధికారులు పేర్కొన్నారు. కాగా, జాతీయ భద్రతకు ముప్పుగా మారారంటూ గత 18నెలల్లో 1.75 లక్షల మంది వీసాలను రద్దు చేయడం గమనార్హం.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!