భారత్‌కు గుడ్ న్యూస్.. హింట్ ఇచ్చిన అమెరికా
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:24 PM
భారత్‌పై విధించిన సుంకాలను అమెరికా సగానికి తగ్గించే యోచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై విధించిన సుంకాలను సగానికి తగ్గించే యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సంకేతాలిచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం తుదిదశకు చేరుకుందన్న వార్తల నడుమ బెసెంట్ వ్యాఖ్యలకు అమిత ప్రాధాన్యం ఏర్పడింది (Scott Bessent Hints at Reducing Tariffs on India).
ఇటీవల అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమెరికా మంత్రి స్కాట్ బెసెంట్ భారత్‌పై సుంకాల గురించి మాట్లాడారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు చాలా వరకూ తగ్గించాయని అన్నారు. గతేడాది భారత్‌పై సుంకాల విధింపునకు ఇది ప్రధాన కారణమని గుర్తుచేశారు. ‘రష్యా చమురు కొనుగోళ్లు చాలా వరకూ తగ్గిపోయాయి. ఇది మాకు సక్సెస్’ అని కామెంట్ చేశారు. ‘అప్పట్లో విధించిన సుంకాలు ఇప్పటికీ కొనసాగుతున్నా వాటిని తొలగించే ఛాన్స్ ఉంది’ అని కామెంట్ చేశారు.
గతేడాది ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంపై సుంకాల భారం మోపిన విషయం తెలిసిందే. ఇక రష్యా చమురును కొనుగోలు చేస్తున్న కారణం చెప్పి భారత్‌పై సుంకాలను రెండింతలు పెంచి 50 శాతానికి చేర్చారు.

ఇక భారత్ విషయంలో అమెరికా అధికారులు రోజుకో ప్రకటన చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల భారత్‌తో కుదుర్చుకోవాల్సిన వాణిజ్య ఒప్పందం చివరి నిమిషంలో ఆగిపోయిందని వాణిజ్య శాఖ మంత్రి హావర్డ్ లట్నిక్ చెప్పుకొచ్చారు. ఒప్పందం తుదిదశకు చేరుకున్నా ట్రంప్‌కు మోదీ ఫోన్ చేయకపోవడంతో ఒప్పందం ముందుకు సాగలేదని అన్నారు. నాటి నిబంధనల ప్రకారం, ఒప్పందం కుదిరే అవకాశం తక్కువని కూడా చెప్పుకొచ్చారు. ఇందుకు భిన్నంగా స్కాట్ బెసెంట్ సానుకూల వ్యాఖ్యలు చేశారు.
ఇవీ చదవండి:
చైనా మిమ్మల్ని తినేస్తుంది.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక
అందుకే నా చేతికి గాయం అయ్యింది: డొనాల్డ్ ట్రంప్