Share News

అనారోగ్యంతో ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత..

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:12 AM

ప్రముఖ హాలీవుడ్ నటి డేవే ఛేజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ప్రాణాలు కోల్పోయారు.

అనారోగ్యంతో ప్రముఖ హాలీవుడ్ నటి కన్నుమూత..
Daveigh Chase

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ హాలీవుడ్ నటి డేవే ఛేజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని డేవీ ఛేజ్ మేనేజర్ జాన్ రయాన్ జూనియర్ బుధవారం ధ్రువీకరించారు. డేవే ఛేజ్ పోషకాహార లోపం కారణంగా కొద్దిరోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. మెనింజైటిస్ రావటంతో ఆమె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. ఆ అనారోగ్యం బ్లడ్‌స్ట్రీమ్ ఇన్‌ఫెక్షన్‌తో పాటు సెప్సిస్‌కు దారితీయటంతో పరిస్థితి మరింత దిగజారింది. డాక్టర్లు ఆమెను కాపాడ్డానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.


చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. డేవే ఛేజ్ మేనేజర్ జాన్ రయాన్ జూనియర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తను చాలా గొప్ప మనిషి. ఆమెకు పిల్లులంటే చాలా ఇష్టం. పిల్లుల సంరక్షణ కోసం మాతో పాటు కలిసి పనిచేస్తోంది. ఛేజ్ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేది. ఆమె హాలీవుడ్ సినిమాలకు అంతగా ప్రాధాన్యం ఇచ్చేది కాదు. ఛేజ్ తరచుగా లాస్ వెగాస్‌లోని తన ఇంటికి వెళ్లి నెలల పాటు ఏకాంతంగా గడిపేది. చిన్న, ఇండిపెండెంట్ సినిమాల్లో నటించడం కోసం పెద్ద బ్యానర్ల సినిమాలను కాదంది. ఆమెకు నటన అంటే చాలా ఇష్టం. కానీ, ఫేమస్ అవ్వాలన్న ఉద్దేశం లేదు’ అని అన్నారు.


డేవే ఛేజ్ సినిమా ప్రస్థానం..

ఛేజ్ 1998లో ‘సబ్రినా ది టీనేజ్ విచ్’ టెలివిజన్ షోతో యాక్టింగ్ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 2001లో విడుదలైన ‘డోనీ డార్కో’ సినిమాతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 2002లో విడుదలైన ‘ది రింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2016 వరకు సినిమాల్లో నటించారు. ‘అమెరికన్ రొమాన్స్’ ఆమె నటించిన చివరి చిత్రం. ఛేజ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో టెలివిజన్ షోలు కూడా చేశారు. 2015లో ‘కిల్లర్ క్రష్’ షోలో చివరగా కనిపించారు. 2016 నుంచి నటనకు దూరంగా ఉంటున్నారు.


ఇవి కూడా చదవండి

సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్.. వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి!

బీబీ ఒకసారి ఆలోచించండి.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్

Updated Date - Jun 18 , 2026 | 11:48 AM