Share News

పాక్‌పై డ్రోన్ దాడులు చేశాము: అఫ్గానిస్థాన్

ABN , Publish Date - Mar 13 , 2026 | 10:00 PM

పాక్ మిలిటరీ స్థావరాలపై డ్రోన్ దాడులు చేశామని తాలిబాన్లు ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌లో పాక్ ఇటీవల జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేశామని పేర్కొన్నారు.

పాక్‌పై డ్రోన్ దాడులు చేశాము: అఫ్గానిస్థాన్
Taliban drone attack on Pakistan

ఇంటర్నెట్ డెస్క్: పాక్‌లోని మిలిటరీ స్థావరాలపై డ్రోన్‌లతో దాడులు చేశామని తాలిబాన్లు శుక్రవారం తెలిపారు. ఖైబర్‌పాఖ్‌తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కొహాట్‌లోగల స్థావరాలపై ఈ దాడులు చేసినట్టు పేర్కొన్నారు. నిన్న పాక్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని వెల్లడించారు.

ఒక మిలిటరీ స్థావరం, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇతర ఆర్మీ భవనాలపై దాడులు చేశామని అఫ్గాన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడుల్లో ఆస్తి, ప్రాణ నష్టం భారీగానే ఉందని అన్నారు. అయితే, పాక్ మాత్రం ఈ విషయాలను ఇంకా ధ్రువీకరించలేదు.

అఫ్గానిస్థాన్‌లో ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని పాక్ నిన్న ప్రకటించింది. కాబూల్, కాందహార్, పక్తియాల్లోని ఉగ్రవాదులను టార్గెట్ చేశామని పేర్కొంది. కానీ తమ భూభాగంలోని పౌర భవనాలపై ఈ దాడులు జరిగాయని అఫ్గానిస్థాన్ ప్రకటించింది. సామాన్యులు ప్రాణాలు పోగొట్టుకున్నారని పేర్కొంది.


తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) అనే ఉగ్రసంస్థ విషయంలో పాక్, అఫ్గానిస్థాన్‌ల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తమ భూభాగంలో ఆత్మాహుతి దాడులకు కారణమవుతున్న టీటీపీకి అఫ్గానిస్థాన్ మద్దతుగా ఉందని పాక్ ఆరోపిస్తోంది. కానీ అఫ్గానిస్థాన్ ఈ వాదనలను తోసి పుచ్చింది. అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య ఉన్న డ్యురాండ్ సరిహద్దు రేఖను గుర్తించేందుకు అఫ్గానిస్థాన్ నిరాకరిస్తుండటంతో ఇరు దేశాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.


ఈ వార్తలూ చదవండి:

మా వద్ద సూసైడ్ బోట్స్ ఉన్నాయ్: ఇరాన్ మిలిటరీ

గుర్తుపట్టలేనంతగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ మెుజ్తాబా.. యూఎస్ రక్షణ మంత్రి

Updated Date - Mar 14 , 2026 | 01:34 PM