Share News

అడ్డంగా బుక్కైన సిరియా అధ్యక్షుడు! ఐరాసలో రీల్స్ చూస్తూ..

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:18 PM

ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా తన ప్రసంగానికి ముందు స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టా చూస్తూ కెమెరా కంటికి చిక్కారు.

అడ్డంగా బుక్కైన సిరియా అధ్యక్షుడు! ఐరాసలో రీల్స్ చూస్తూ..
Ahmed Al Sharaa

ఇంటర్నెట్ డెస్క్: క్షణం తీరిక దొరికితే చాలు సోషల్ మీడియాలో షార్ట్‌ వీడియోలు చూస్తూ కాలం గడిపేసేవారు కోకొల్లలు. పోస్టులు, వీడియోలు చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. ఇందుకు దేశాధినేతలు కూడా అతీతం కాదనిపించే ఘటన ఐక్యరాజ్య సమితిలో తాజాగా వెలుగు చూసింది. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు న్యూయార్క్‌కు (యూఎస్) వెళ్లిన సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా అక్కడ తన ప్రసంగానికి ముందు స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టా చూస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

యూఎన్‌లో తన ప్రసంగానికి ముందు సిరియా అధ్యక్షుడు స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టా రీల్స్ చూస్తూ కెమెరా కంటికి చిక్కినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ సమయంలో తుర్కియే అధ్యక్షుడు ఐరాసలో ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో అహ్మద్ అల్ షరా ఇతరులకు రీల్స్ చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. సిరియా అధ్యక్షుడు ఒకప్పుడు అల్ ఖైదా ఉగ్రసంస్థలో సభ్యుడిగా ఉండేవారు. ఆయన నేతృత్వంలోని హయత్ తహ్రీర్ అల్ షామ్ రెబల్ గ్రూపును అమెరికా ఉగ్రసంస్థగా కూడా ప్రకటించింది. ఇక 2024లో అప్పటి అసద్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అహ్మద్ అల్ షరా అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.


ఇక సిరియా అధ్యక్షుడి వీడియో వైరల్ కావడంతో జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. ‘అల్ ఖైదా మాజీ సభ్యుడు కూడా మనలాంటి వ్యక్తే. రీల్స్ లేకుండా ఉండలేరు. సోషల్ మీడియాలో పడి లోకాన్నే మర్చిపోతారు’ అని అనేక మంది కామెంట్ చేశారు.

ఇక సిరియా పగ్గాలు చేపట్టాక అహ్మద్ అల్ షరా తన లక్ష్యం శాంతిస్థాపన అని పలుమార్లు ప్రకటించారు. దేశంలో అన్ని వర్గాల వారూ కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. సిరియాలో గోలన్ హైట్స్ నుంచి ఇజ్రాయెల్ తప్పుకోవాలని తాజాగా డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ లేవని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్-యూరప్ ఎకనామిక్ కారిడార్‌కు మద్దతు ప్రకటించిన ట్రంప్

ట్రంప్‌పై సౌదీ యువరాజు ఆగ్రహం.. మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు..

Updated Date - Sep 23 , 2026 | 04:34 PM