Share News

1400 ఏళ్లు బతకొచ్చు!

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:33 AM

మనిషి మహా అయితే వందేళ్లు బతుకుతాడేమో! ఆరోగ్యంగా ఉంటే మరో పది, ఇరవై ఏళ్లు ఎక్కువ జీవించవచ్చేమో!

1400 ఏళ్లు బతకొచ్చు!
superai

  • సూపర్‌ ఏఐతో వృద్ధాప్యాన్ని జయించే చాన్స్‌

  • దెబ్బతినే కణాల స్థానంలో కొత్త కణాలు

  • ‘సెనోలైటిక్స్‌’పై ఇప్పటికే పరిశోధనలు

  • ఇప్పుడు అసాధ్యమైన చికిత్సలకు

  • భవిష్యత్తులో సూపర్‌ ఏఐ పరిష్కారాలు

  • పాడైన అవయవాల పునరుద్ధరణ

  • ఆక్స్‌ఫర్డ్‌ మాజీ ప్రొఫెసర్‌ నిక్‌ అంచనా

మనిషి మహా అయితే వందేళ్లు బతుకుతాడేమో! ఆరోగ్యంగా ఉంటే మరో పది, ఇరవై ఏళ్లు ఎక్కువ జీవించవచ్చేమో! కానీ ఏకంగా 1,400 ఏళ్లు బతికితే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. భవిష్యత్తులో ఇది సాధ్యమేనని అంటున్నారు స్వీడన్‌కు చెందిన తత్వవేత్త, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ నిక్‌ బోస్ట్రోమ్‌. అత్యంత శక్తివంతమైన కృత్రిమ మేధ(సూపర్‌ ఏఐ) అందుబాటులోకి వస్తే.. వైద్య పరిశోధనలు ఊహించని వేగంతో ముందుకు సాగుతాయని, తద్వారా వృద్ధాప్యాన్ని జయించే అవకాశం ఏర్పడుతుందని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం అసాధ్యమనుకుంటున్న అనేక వ్యాధులకు చికిత్సలను కనుగొనడమే కాకుండా, మనిషి శరీరంలో వృద్ధాప్యం వల్ల వచ్చే మార్పులను కూడా వెనక్కి తిప్పవచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో బోస్ట్రోమ్‌ మాట్లాడుతూ.. ’’సాధారణంగా మనిషికి వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాలు, మరణించే ప్రమాదం పెరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణాల్లో వృద్ధాప్యం ఒకటి. ఆ వృద్ధాప్య ప్రక్రియను ఆపగలిగితే.. మనిషి శరీరం ఎప్పుడూ యవ్వనంలో తరహాలోనే పనిచేస్తుంది. వయసు పెరిగినా మరణించే ప్రమాదం తక్కువగా ఉంటుంది’’ అని చెప్పారు. ప్రస్తుతం నయం చేయడం కష్టమైన వ్యాధులకు సూపర్‌ ఏఐతో మందులు కనుగొనడం, వృద్ధాప్యంతో దెబ్బతిన్న శరీర భాగాలను పునరుద్ధరించడం సాధ్యపడవచ్చని చెప్పారు. అంతేకాదు అల్జీమర్స్‌ వంటి వ్యాధులతో మెదడులో దెబ్బతిన్న కణాలను తిరిగి బాగు చేయగలిగితే.. నిత్య యవ్వనమేనని పేర్కొన్నారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో దెబ్బతినే, పనితీరు మందగించే కణాలను తొలగంచి.. వాటి స్థానంలో పూర్తి ఆరోగ్యవంతమైన కొత్త కణాలు పెరిగేందుకు తోడ్పడే ‘సెనోలైటిక్స్‌’ ఔషధాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.

- సెంట్రల్‌ డెస్క్‌

ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 26 , 2026 | 05:07 AM