స్పెయిన్‌లోకి వలసల వరద
ABN , Publish Date - Aug 01 , 2026 | 05:42 AM
గట్టు తెంచుకున్న వరద మాదిరిగా స్పెయిన్‌ను వేలమంది వలస ప్రజలు ముంచెత్తారు. ఆఫ్రికా ఖండంలో స్పెయిన్ భూభాగమైన సియూటా ద్వీపకల్పంలోకి రెండురోజుల్లోనే...
మొరాకో నుంచి రెండు రోజుల్లో
60 వేల మంది రాక
సియూటా (స్పెయిన్), జూలై 31: గట్టు తెంచుకున్న వరద మాదిరిగా స్పెయిన్‌ను వేలమంది వలస ప్రజలు ముంచెత్తారు. ఆఫ్రికా ఖండంలో స్పెయిన్ భూభాగమైన సియూటా ద్వీపకల్పంలోకి రెండురోజుల్లోనే 60 వేల మంది వలసదారులు చట్టవ్యతిరేకంగా ప్రవేశించారు. సరిహద్దు దేశమైన మొరాకో నుంచి అత్యంత ప్రమాదకరంగా సముద్రంలో ఈదుకుంటూ వీరంతా బుధ, గురువారాల్లో సియూటా నగరంలోకి వచ్చారు. ఈ క్రమంలో సముద్రంలో మునిగి 18 మంది మరణించారు. ఒక్కసారిగా వేలమంది రావటంతో సియూటా తీరంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రస్తుతం సియూటా నగరంలో ఎటుచూసినా వలసదారులే కనిపిస్తున్నారు. వలసలను అదుపుచేసేందుకు స్పెయిన్ ప్రభుత్వం నగరం సరిహద్దుల్లో సైన్యాన్ని, నౌకాదళాన్ని మోహరించింది. వలసదారులు మొరాకో పట్టణాలైన ఫ్నిదెఖ్, బెలియోనెచ్ నుంచి సముద్రంలో 5 కిలోమీటర్లు ఈదుకుంటూ సియూటాకు చేరుకుంటున్నారు. స్పెయిన్‌లోకి భూమార్గం ద్వారా అక్రమంగా ప్రవేశించేవారిని వెంటనే వెనక్కి పంపేయాలని, సముద్ర మార్గం ద్వారా ప్రవేశించే అక్రమ వలసదారులను మాత్రం చట్టప్రకారం అన్ని ప్రక్రియలు పూర్తిచేసి వెనక్కి పంపాలని జూలై మొదటివారంలో ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సముద్రమార్గంలో వెళ్తే వెంటనే వెనక్కి పంపబోరన్న ఆలోచనతో వలసదారులు ఈ ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు. ఒక్కసారి సియూటాలోకి ప్రవేశిస్తే ఆశ్రయం కోరుతూ యూరప్ ఖండంలోకి ప్రవేశించటం తేలికవుతుందని వలసదారులు నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో వలసలను వెంటనే ఆపాలని, లేదంటే సరిహద్దు ఒప్పందం నుంచి తప్పుకుంటామని స్పెయిన్‌ను ఇటలీ హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News