గంటకు 8700 కి.మీ.వేగంతో చంద్రుణ్ని ఢీకొట్టి..
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:47 AM
రెండు స్పేస్ క్రాఫ్ట్‌లను భూమ్మీది నుంచి తీసుకెళ్లి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ పైభాగం (అప్పర్ స్టేజ్) ఒకటి... కక్ష్య తప్పి నేరుగా వెళ్లి చంద్రుడి ఉపరితలంపై...
16అడుగుల లోయను ఏర్పర్చిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ పైభాగం
కేప్‌కెనవరాల్, ఆగస్టు 5: రెండు స్పేస్ క్రాఫ్ట్‌లను భూమ్మీది నుంచి తీసుకెళ్లి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన స్పేస్‌ఎక్స్ రాకెట్ పైభాగం (అప్పర్ స్టేజ్) ఒకటి... కక్ష్య తప్పి నేరుగా వెళ్లి చంద్రుడి ఉపరితలంపై గంటకు 8,700 కిలోమీటర్ల వేగంతో కూలిపోయింది. దాదాపు 4500 కిలోల బరువు.. 39 అడుగుల పొడుగు.. ఐదంతస్తుల భవనం అంత ఉండే ఫాల్కన్ 9 రాకెట్ పైభాగమది. గత ఏడాది జనవరిలో ఆ రాకెట్‌ను ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ కంపెనీకి చెందిన బ్లూఘోస్ట్, ఐస్పే్‌సకు చెందిన రిసైలియన్స్ అనే రెండు ప్రైవేటు లూనార్ ల్యాండర్లను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనంతరం అది నియంత్రణ కోల్పోయింది. భూమి, చంద్రుడి మధ్య కక్ష్యలో తిరుగుతూ.. క్రమంగా కక్ష్యమారి గురుత్వాకర్షణ కారణంగా చంద్రుడివైపు అదుపు లేని వేగంతో దూసుకెళ్లి, చందమామ పడమటి దిక్కున ఉన్న ‘ఐన్‌స్టీన్ క్రేటర్’కు సమీపంలో కూలిపోయింది. ఆ తాకిడికి 3 టన్నుల టీఎన్‌టీ పేలుడుతో సమానమైన శక్తి విడుదలైనట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 3 టన్నుల టీఎన్‌టీ అంటే... 15వేల డైనమెట్ స్టిక్స్ ఒకేసారి పేలితే ఎంత శక్తి విడుదలవుతుందో అంత శక్తి అన్నమాట. దాని దెబ్బకు చందమామ ఉపరితలంపై కొత్తగా మరో క్రేటర్ ఏర్పడింది. ఆ భారీ గుంత వ్యాసం దాదాపుగా 90 అడుగులు.. లోతు దాదాపు 16 అడుగులు ఉంటుందని అంచనా. రాకెట్ అప్పర్‌స్టేజ్ చంద్రుడిపై కూలే సమయానికి.. నాసాకు చెందిన లూనార్ రికన్నైజాన్స్ ఆర్బిటర్, దక్షిణకొరియాకు చెందిన దనూరి స్పేస్‌క్రాఫ్ట్ జాబిలి కక్ష్యలోనే ఉన్నాయి. కానీ.. కూలిన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసే చోట లేవు. అది కూలడానికి రెండు నిమిషాల ముందే దనూరి స్పేస్‌క్రాఫ్ట్ ఆ ప్రదేశాన్ని దాటి ముందుకు వెళ్లిపోయింది. అది అలా వెళ్లేటప్పుడు తీసిన ఫొటోలను.. చంద్రుణ్ని చుట్టి మళ్లీ అదే ప్రదేశానికి వచ్చినప్పుడు తీసిన ఫొటోలను విశ్లేషించి, ఆ తర్వాత విడుదల చేస్తామని దక్షిణ కొరియా అంతరిక్ష సంస్థ ‘కొరియా ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ (కాసా)’ ప్రకటించింది.
ఇవీ చదవండి:
ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు
'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం