న్యూయార్క్ నుంచి డబ్లిన్ వరకు..
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:41 AM
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలో లోపాలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఉద్యమానికి విదేశాల్లోనూ...
సీజేపీ ఆందోళనలకు మద్దతుగా ప్రదర్శనలు
వాషింగ్టన్, జూలై 22: నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలో లోపాలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఉద్యమానికి విదేశాల్లోనూ మద్దతు లభిస్తోంది. విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్‌లో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. న్యూయార్క్, శాన్‌హోసే నగరాల్లో ‘‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’’ సంస్థ కార్యకర్తలు వాంగ్‌చుక్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లండన్‌లోని భారత హైకమిషన్, డబ్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట కూడా నిరసనలు చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది. వాంగ్‌చుక్‌తో పాటు ఇతర నిరసనకారులతో వెంటనే చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, ఢిల్లీలో మూడువారాలకు పైగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అనంతరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. మరోవైపు ఈ ఆందోళనలకు ప్రతిపక్షాలు కూడా పూర్తి మద్దతు ప్రకటించి ఢిల్లీలో పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి.
Also Read:
కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం
గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి