చైనా రాజధాని బీజింగ్‌లో విమాన ప్రమాదం.. ముక్కలై కిందపడిపోయిన విమానం..
ABN , Publish Date - Jun 27 , 2026 | 08:22 AM
చైనా రాజధాని బీజింగ్‌లో విమానం ప్రమాదానికి గురైంది. దేశ రాజధానిలోనే అత్యంత ఎత్తైన భవనాన్ని చిన్న విమానం ఢీకొట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: చైనా రాజధాని బీజింగ్‌లో విమానం ప్రమాదానికి గురైంది. దేశ రాజధానిలోనే అత్యంత ఎత్తైన భవనాన్ని చిన్న విమానం ఢీకొట్టింది. 12 వేల మంది ఉద్యోగులు పని చేయగల సామర్థ్యం ఉన్న 108 అంతస్తుల సిటిక్ టవర్‌ను దేశీయంగా తయారైన సన్‌వార్డ్ SA60L అరోరా అనే తేలికపాటి స్పోర్ట్స్ విమానం శుక్రవారం బలంగా ఢీకొంది. దీంతో విమానం అక్కడికక్కడే ముక్కలై కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని వారికి ఏం జరిగిందనే దానిపై స్పష్టత రాలేదు.
మరోవైపు విమానం శకలాలు కిందపడటంతో ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. చిన్నపాటి అగ్నిప్రమాదం కూడా చోటుచేసుకుంది. అలాగే భవనం స్వల్పంగా దెబ్బతింది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియోలు తీయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో చైనా అధికారులు సోషల్ మీడియాలోని ఆ వీడియోలను తొలగించారు. ప్రమాదానికి గురైన విమానాన్ని స్థానిక జనరల్ ఏవియేషన్ కంపెనీ తయారు చేసింది. పైలట్ శిక్షణ, వ్యక్తిగత వినోదం, ఏరియల్ ఫొటోగ్రఫీ తదితర అవసరాలకు దీనిని వినియోగిస్తుంటారు.
కాగా, ఈ ఘటనపై జనరల్ ఏవియేషన్ సంస్థ గానీ, చైనా ప్రభుత్వం గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం బీజింగ్‌లో డ్రోన్లు ఎగరవేయడాన్ని నిషేధించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ డ్రోన్లను ఎగరవేయడం, అద్దెకు తీసుకోవడం లేదా కొనుగోలు చేయడం చేయరాదు.
ఈ వార్తలు కూడా చదవండి
ఇరాన్ కీలక ప్రాంతాలపై విరుచుకుపడిన యూఎస్ సెంట్రల్ కమాండ్..
వెనుజువెలాలో మరోసారి భూ ప్రకంపనలు..