Share News

ఇరాన్‌ కీలక ప్రాంతాలపై విరుచుకుపడిన యూఎస్ సెంట్రల్ కమాండ్..

ABN , Publish Date - Jun 27 , 2026 | 07:00 AM

ఇరాన్‌- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇరాన్‌పై అగ్రరాజ్యం మరోసారి యుద్ధానికి దిగింది. గురువారం హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సింగపూర్ వాణిజ్య నౌకపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

ఇరాన్‌ కీలక ప్రాంతాలపై విరుచుకుపడిన యూఎస్ సెంట్రల్ కమాండ్..
Iran US Conflict

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇరాన్‌పై అగ్రరాజ్యం మరోసారి యుద్ధానికి దిగింది. ఇరాన్ తీరప్రాంత రాడార్ స్థావరాలతో పాటు ఇరానియన్‌ మిస్సైల్‌, డ్రోన్‌ స్టోరేజ్‌ ఫెసిటిలీస్‌పై యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) దాడులు చేసింది. గురువారం హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సింగపూర్ వాణిజ్య నౌకపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా తాము ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం తర్వాత యూఎస్ డైరెక్ట్‌ మిలిటరీ అటాక్‌ ఇదే కావడం గమనార్హం.


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నిన్న (శుక్రవారం) సింగపూర్‌ షిప్‌పై ఇరాన్‌ దాడిని ఖండించిన కాసేపటికే ఈ అటాక్ జరిగింది. యూఎస్ దాడులతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇరాన్‌ తమపై ప్రతీకార దాడులకు పాల్పడవచ్చని గల్ఫ్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు క్రూడాయిల్‌ ఉత్పత్తి, సరఫరా పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హోర్ముజ్‌పై ఇరుదేశాల ఆధిపత్య పోరుతో ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టే పరిస్థితి కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. కాగా, ఈ దాడులపై ఎక్స్ వేదికగా యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పందించింది.


యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ పోస్టు..

'జూన్ 25న ఒమన్ తీరం వెంబడి హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్తున్న సింగపూర్‌కు చెందిన సరకు రవాణా నౌక M/V ఎవర్ లవ్లీపై ఇరాన్ వన్-వే అటాక్ డ్రోన్‌తో దాడి చేసింది. వాణిజ్య నౌకపై ఇరాన్ దళాలు జరిపిన ఈ అకారణ దాడి.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించింది. ఇరాన్ ప్రమాదకరమైన ఈ చర్య అంతర్జాతీయ వాణిజ్య కారిడార్ ద్వారా నౌకాయాన స్వేచ్ఛను దెబ్బతీశాయి. దీంతో జూన్ 26న ఇరాన్‌పై యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు దాడులకు దిగాయి. జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కోసం మద్దతు అందిస్తూనే ఉంటాం. ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంలోని అన్ని అంశాలకు కట్టుబడి ఉన్నాం' అని పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

భూకంపం వస్తోంది జాగ్రత్త

Updated Date - Jun 27 , 2026 | 07:48 AM