Share News

యుద్ధం వేళ పశ్చిమాసియాకు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు

ABN , Publish Date - Feb 28 , 2026 | 06:26 PM

ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడులు జరుపుతుండటంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌కు పలు దేశాలు తమ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించాయి.

యుద్ధం వేళ పశ్చిమాసియాకు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
airlines

టెహ్రాన్: ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడులు జరుపుతుండటంతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతిదాడులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌కు పలు దేశాలు తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. పశ్చిమాసియాకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఇండిగో, ఎయిరిండియా ప్రకటించాయి. గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితుల దృష్ట్యా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేసినట్టు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమకు కీలకమని, పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామని చెప్పారు.


విమాన సర్వీసులను రద్దు చేసిన ఎయిర్‌లైన్స్ ఇవే..

పశ్చిమాసియాకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన విమానయాన సంస్థల్లో ఎయిర్ ఫ్రాన్స్, ఎయిరిండియా, బ్రిటిష్ ఎయిర్ వేస్, ఐబీరియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, జపాన్ ఎయిర్‌లైన్స్, ఎల్ఓటీ ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, నార్వేజియన్ ఎయిర్, టర్కిష్ ఎయిర్‌లైన్స్, వర్జిన్ అట్లాంటిక్, ఖతార్ ఎయిర్‌వేస్, ఎయిర్ అల్జీరియా, స్కాండేవియన్ ఎయిర్‌లైన్స్, విజ్ ఎయిర్ ఉన్నాయి.


ముప్పును ముందస్తుగా నివారించేందుకే..

ఇరాన్ లక్ష్యంగా క్షిపణులు, బాంబులతో ఇజ్రాయెల్ శనివారంనాడు దాడులకు దిగింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ముప్పును ముందస్తుగా నివారించేందుకు ఈ దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆ వెంటనే అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తగా సైనిక చర్యకు దిగిట్టు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'గా తమ సైనిక చర్యను అమెరికా, 'ఆపరేషన్ రోరింగ్ లయన్'గా తమ సైనిక చర్యను ఇజ్రాయెల్ ప్రకటించుకున్నాయి.


ఇరాన్ ప్రతిదాడులు

మరోవైపు, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. యూఏఈ, కువైట్, ఖతర్‌లలో పేలుళ్లు వినిపించినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తమదేశంలోని అమెరికా నేవీ 5వ ఫ్లీట్‌పై క్షిపణి దాడి జరిపినట్టు బహ్రెయిన్ ధ్రువీకరించింది. అయితే ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్ బేస్ నుంచి ఇప్పటికే తమ నౌకలను అమెరికా నేవీ ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

రహస్య ప్రదేశానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

Updated Date - Feb 28 , 2026 | 06:31 PM