యూకే నుంచి విడిపోతాం!
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:38 AM
యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) నుంచి విడిపోయి స్వతంత్రంగా ఉంటామంటూ స్కాట్లండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్ ప్రభుత్వాధినేతలు(వీరిని ఆయా ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్స్ అని అంటారు) ప్రకటించారు..
స్కాట్లండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్ ఉమ్మడి ప్రకటన
లండన్, సెప్టెంబరు 15: యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) నుంచి విడిపోయి స్వతంత్రంగా ఉంటామంటూ స్కాట్లండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్ ప్రభుత్వాధినేతలు(వీరిని ఆయా ప్రాంతాల ఫస్ట్ మినిస్టర్స్ అని అంటారు) ప్రకటించారు. ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) మీద సంతకాలు చేశారు. ‘మూడు ప్రాంతాల్లో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. యూకే నుంచి స్వాతంత్య్రం కోసం కట్టుబడి ఉన్న ఫస్ట్ మినిస్టర్స్ మూడింటిలోనూ తొలిసారిగా ఎన్నికయ్యారు. వెస్ట్‌మినిస్టర్ (యూకే పార్లమెంటు) సమయం దగ్గర పడుతోందనటానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. దీనిని యావత్ ప్రపంచం గమనిస్తోంది’ అని ఎంవోయూలో పేర్కొన్నారు. వేల్స్ రాజధాని కార్డిఫ్ నగరంలో స్కాట్లండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్ ఫస్ట్ మినిస్టర్స్ జాన్ స్వినీ, మైఖేల్ ఒ నీల్, రున్ అప్‌లోర్‌వర్త్ సోమవారం సమావేశమయ్యారు. స్వయం నిర్ణయాధికారానికి తమ దేశాలకు హక్కు ఉందని, ప్రజాస్వామ్యాన్ని వెస్ట్‌మినిస్టర్ అడ్డుకోలేదని తేల్చి చెప్పారు. విభజనకు వీలుగా అవసరమైన ప్రణాళికను బ్రిటన్ ప్రభుత్వం సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, యూకేలో బ్రిటన్‌తోపాటు స్కాట్లండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్ సభ్యులుగా కొనసాగుతున్నాయి. విద్య, వైద్యం తదితర అంశాల్లో వీటికి స్వయంప్రతిపత్తి ఉంది. విడిగా చట్టసభలున్నాయి. బ్రెగ్జిట్ ప్రక్రియ ద్వారా యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు రావటాన్ని ఈ మూడు ప్రాంతాల్లోని అధికారపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇవి యూకే నుంచి విడిపోతే, తిరిగి ఈయూలో చేరే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News