లిబియాలో రష్యా యుద్ధనౌక ‘మెర్క్యూరీ’ ధ్వంసం!
ABN , Publish Date - Nov 23 , 2026 | 06:40 AM
లిబియాలోని బెంఘాజీ ఓడరేవు వద్ద రష్యా యుద్ధనౌక ‘మెర్క్యూరీ’ అనుమానిత ఉక్రెయిన్ సముద్ర డ్రోన్ దాడిలో మునిగిపోయింది. బాల్టిక్ సముద్రంలో మరో రష్యా నౌకపై కూడా దాడి జరిగింది.
ఆంధ్రజ్యోతి, నవంబర్ 23: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ ఉక్రెయిన్‌కు వెయ్యి మైళ్లకు పైగా దూరంలో ఉన్న లిబియాలోని బెంఘాజీ ఓడరేవు వద్ద రష్యా నౌకాదళానికి చెందిన యుద్ధనౌక 'మెర్క్యూరీ'.. అనుమానిత ఉక్రెయిన్ సముద్ర డ్రోన్ దాడిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.
తూర్పు లిబియా ప్రభుత్వ అధికారుల ప్రకారం, ఇంధనం, సామగ్రి కోసం బెంఘాజీ ఓడరేవులో నిలిపి ఉంచిన రష్యా నావికాదళ కార్వెట్ (చిన్న తరహా యుద్ధనౌక) 'మెర్క్యూరీ'పై ఆదివారం తెల్లవారుజామున దాడి జరిగింది.
నాలుగు ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేయగా, మరో రెండు డ్రోన్లు నౌకను ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ఉపగ్రహ చిత్రాల్లో ఆ యుద్ధనౌక మునిగిపోయినట్లు కనిపించింది.
'మెర్క్యూరీ'పై దాడి జరిగిన కొన్ని గంటలకే బెంఘాజీ తీరానికి సమీపంలో సైనిక సామగ్రిని తీసుకెళ్తున్నట్లు భావిస్తున్న రష్యా అనుబంధ సరుకు రవాణా నౌక 'అస్కలాన్' పై కూడా సముద్ర డ్రోన్ దాడి జరిగింది. ఈ పేలుడులో గాయపడిన సిబ్బందిని లిబియా నావికాదళం రక్షించి చికిత్స అందిస్తోంది.
జనరల్ ఖలీఫా హఫ్తార్ నేతృత్వంలోని లిబియన్ నేషనల్ ఆర్మీ (LNA) ఆధీనంలో ఉన్న తూర్పు లిబియాతో రష్యాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సిరియాలో స్థావరాలను కోల్పోయిన తర్వాత ఆఫ్రికాలోని రష్యా కిరాయి సైన్యానికి సరఫరాలు అందించడానికి, మధ్యధరా సముద్రంలో పట్టు నిలుపుకోవడానికి రష్యాకు బెంఘాజీ కీలకంగా మారింది.
పశ్చిమ లిబియాలోని మిస్రాతాలో ఉక్రెయిన్ ప్రత్యేక దళాల చిన్న బృందం ఉందని, గత ఏడాది కాలంగా రష్యా నౌకలపై దాడులను సమన్వయం చేస్తోందని భావిస్తున్నారు.
ఈ దాడులను రష్యా కానీ, ఉక్రెయిన్ కానీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, లిబియా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ, తమ ఓడరేవులను అంతర్జాతీయ ఘర్షణలకు వేదికగా మార్చడాన్ని సహించబోమని తూర్పు లిబియా అధికారులు అంటున్నారు. దోషులపై చట్టపరమైన, దౌత్యపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా, శనివారం బాల్టిక్ సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో (రష్యాలోని గోగ్లాండ్ ద్వీపానికి పశ్చిమాన) రష్యా సరుకు రవాణా నౌక 'స్పార్టా-II' పై కూడా డ్రోన్ దాడి జరిగింది. కాలినిన్గ్రాడ్ వైపు వెళ్తున్న ఈ నౌక దెబ్బతిని, ఆ తర్వాత ఫిన్లాండ్ జలాల్లోకి కొట్టుకుపోయింది. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉండవచ్చని ఫిన్లాండ్ సైన్యం పేర్కొంది. నౌకలోని 16 మంది సిబ్బందిని సురక్షితంగా మరో రష్యా నౌకలోకి తరలించారు (ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి). మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫిన్లాండ్, రష్యా, ఎస్టోనియా అత్యవసర బృందాలు కృషి చేశాయి.
ఈ ఘటనల నేపథ్యంలో యుద్ధం నాటో దేశాల భూభాగానికి విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. (Russian warship Merkury)
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్