Russia Warns US: అమెరికాకు రష్యా వార్నింగ్.. మిలిటరీ దాడులు తప్పవంటూ..
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:01 PM
అమెరికా చర్యతో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుతిన్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా ఆయిల్ షిప్‌ను అమెరికా సీజ్ చేయడాన్ని రష్యా తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికా చర్యతో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుతిన్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి చెందిన నేత అలెక్సీ జురావ్లెవ్ ఈ సంఘటనపై స్పందిస్తూ.. ‘అగ్రరాజ్యం అతి విశ్వాసంతో ప్రవర్తిస్తోంది. అమెరికాను అడ్డుకోవాలి. అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. టార్పిడోలతో దాడులు చేయటం అమెరికా కోస్ట్ గార్డ్ షిప్‌లను ముంచేయటం వంటివి చేయాల్సి వస్తుంది’ అని గట్టిగా హెచ్చరించారు.
కాగా, రష్యాకు చెందిన భారీ చమురు ట్యాంకర్ ‘మరినెరా’తో పాటు సోఫియా పేరిట ఉన్న మరో ట్యాంకర్‌ను అమెరికా తీరప్రాంత గస్తీ దళం బుధవారం తమ నియంత్రణలోకి తీసుకుంది. ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలో ఐస్‌ల్యాండ్, యూకే మధ్య నుంచి ప్రయాణిస్తున్న ‘మరినెరా’పై అమెరికా కోస్ట్‌గార్డు దళాలు హెలికాప్టర్లలో దిగి స్వాధీనంలోకి తీసుకున్నాయి. ఖాళీగా ఉన్న ఈ నౌక వెనెజువెలా నుంచి బయలుదేరి రష్యా వైపు ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు.
ఇక, సోఫియా ట్యాంకర్ కరీబియన్ ప్రాంతంలో వెనెజువెలా వైపు ప్రయాణిస్తోంది. వెనెజువెలాపై ఆంక్షలు ఉన్నా కూడా ఆ దేశం నుంచి చమురు రవాణా చేస్తోందని, హెజ్బొల్లా ఉగ్రవాద గ్రూపుతో సంబంధమున్న కంపెనీకి కార్గోను అక్రమంగా రవాణా చేస్తోందని పేర్కొంటూ రష్యాకు చెందిన బెల్లా-1 నౌకపై అమెరికా నిషేధం విధించింది.
ఇవి కూడా చదవండి..
కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క.. ఎందుకంటే?
మూడేళ్ల తర్వాత కాదు.. ఇప్పుడే రా చూసుకుందాం.. కేతిరెడ్డికి జేసీ సవాల్