Share News

విదేశీయులు కీవ్‌ను వీడి వెళ్లండి.. భారీ దాడులకు సిద్ధమవుతున్న రష్యా..

ABN , Publish Date - May 26 , 2026 | 12:03 PM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకర దశలోకి వెళ్లేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిపింది. ముఖ్యంగా శక్తిమంతమైన హైపర్‌సోనిక్ 'ఒరెష్నిక్' క్షిపణులను వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది.

విదేశీయులు కీవ్‌ను వీడి వెళ్లండి.. భారీ దాడులకు సిద్ధమవుతున్న రష్యా..
Russia Ukraine War

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత భీకర దశలోకి వెళ్లేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిపింది. ముఖ్యంగా శక్తిమంతమైన హైపర్‌సోనిక్ 'ఒరెష్నిక్' క్షిపణులను వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. విదేశీయులు కీవ్‌ను వదలి వెళ్లాలని రష్యా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై దాడులు రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతాయని ఈ ప్రకటన ద్వారా రష్యా తాజాగా సంకేతాలు ఇచ్చింది (Russia Ukraine War).


రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ తాజాగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీవ్‌లోని ఉక్రెయిన్ సైనిక కేంద్రాలు, కమాండ్ హబ్‌లపై వ్యవస్థీకృత దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసినట్లు రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ తమ భూభాగంలోని పౌర ప్రాంతాలపై దాడులు చేస్తోందని ఆరోపిస్తూ, ప్రతీకార చర్యలుగా ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపింది. విదేశీ దౌత్యవేత్తలు, పౌరులు కీవ్ నగరాన్ని వీడి బయటకు వెళ్లాలని రష్యా పేర్కొంది (Kyiv Attack).


ఇటీవల జరిగిన భారీ దాడిలో వందలాది డ్రోన్లు, దాదాపు 90 క్షిపణులను ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించింది (Russia Missile Strike). కీవ్ నగరంలోని నివాస భవనాలు, పాఠశాలలు, సాంస్కృతిక కట్టడాలు దెబ్బతిన్నాయి. పలువురు మరణించగా, దాదాపు వందమంది గాయపడ్డారు. ప్రజలు రాత్రంతా మెట్రో స్టేషన్లలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఈ దాడుల్లో ఉపయోగించిన 'ఒరెష్నిక్' హైపర్‌సోనిక్ క్షిపణులు అణు వార్‌హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగినవని సమాచారం. వీటిని అడ్డుకోవడం చాలా కష్టమని యూరప్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..


నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

Updated Date - May 26 , 2026 | 12:03 PM