భారత్‌కు కొత్త రవాణా మార్గంపై రష్యా దృష్టి!
ABN , Publish Date - Aug 09 , 2026 | 04:46 PM
రష్యా-భారత్‌కు ప్రత్యక్ష రైలు మార్గం ఎంతో దూరంలో లేదా..? అంటే, అవుననే సమాధానం వస్తోంది. రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు నేరుగా రైలు మార్గాన్ని నిర్మించే ఆలోచనను రష్యా పరిశీలిస్తోంది.
మాస్కో(రష్యా), ఆగస్టు 9: రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు నేరుగా రైలు మార్గాన్ని (Direct Rail Link) నిర్మించే ఆలోచనను రష్యా పరిశీలిస్తోంది. బాస్పోరస్, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) మార్గాల్లో ఎదురవుతున్న రవాణా ప్రమాదాలు, భద్రతా సవాళ్లను అధిగమించేందుకు రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మారత్ ఖుస్నుల్లిన్ ఈ ప్రతిపాదనను తెచ్చారు.
'హిందూ మహాసముద్రానికి రైలు మార్గాన్ని కూడా అన్వేషించాలి. బోస్ఫరస్, హోర్ముజ్ జలసంధికి సంబంధించిన ప్రమాదాల కారణంగా తుర్క్‌మెనిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ గుండా ప్రత్యామ్నాయ మార్గాలు అవసరం కావచ్చు. భారతదేశానికి ప్రవేశం కల్పించే ఏ మార్గమైనా ఆమోదయోగ్యమే' అని ఖుస్నుల్లిన్ చెప్పినట్లు TASS వార్తా సంస్థ పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే రష్యా - భారతదేశాల మధ్య మల్టీ-మోడల్ మార్గం ద్వారా రైలు సరుకు రవాణా సాధ్యమవుతుంది.
అంతర్జాతీయ కారిడార్లతో పాటు రష్యా దేశీయ నిర్మాణ రంగానికి దీర్ఘకాలిక ఆర్థిక చేయూత అవసరమని ఖుస్నుల్లిన్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ రంగం ఏటా అదనంగా ఒక ట్రిలియన్ రూబుళ్లను సద్వినియోగం చేసుకోగలదన్నారు.
ఈ కారిడార్‌లో రష్యా నుంచి రైలులో ఇరాన్/పాకిస్థాన్ ఓడరేవు వరకు వచ్చి, అక్కడి నుంచి ఓడల ద్వారా (సముద్ర మార్గంలో) భారత రేవులకు సరుకులు చేరుతాయి. ఇది ఇంకా ప్రాజెక్ట్ గా మారలేదు, రష్యా ప్రభుత్వం దీని సాధ్యాసాధ్యాలను అన్వేషిస్తున్నట్టు ప్రతిపాదించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు
భాగ్యనగర మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: కేటీఆర్