Share News

రష్యాలో వాట్సాప్‌పై నిషేధం!

ABN , Publish Date - Feb 12 , 2026 | 05:38 PM

వాట్సాప్‌పై రష్యా నిషేధం విధించింది. తమ చట్టాలకు కట్టుబడి ఉండనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి తెలిపారు.

రష్యాలో వాట్సాప్‌పై నిషేధం!
Russia bans WhatsApp

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ ప్రజలకు అందుబాటులో లేకుండా రష్యా తాజాగా బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ ధ్రువీకరించారు. తమ దేశ చట్టాలకు వాట్సాప్ కట్టుబడి ఉండేందుకు విముఖత చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు (Russia Blocks WhatsApp).

ఈ విషయంపై వాట్సాప్ కూడా స్పందించింది. తమ యాప్‌ ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేందుకు రష్యా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొంది. ‘మా యాప్‌ను పూర్తిగా బ్లాక్ చేసేందుకు రష్యా ప్రయత్నించింది. ప్రభుత్వ నిఘా ఉన్న యాప్‌ వైపు ప్రజలు మళ్లేలా చేస్తోంది. 100 మిలియన్‌ల మంది యూజర్లను భద్రతమైన మేసేజింగ్ వ్యవస్థకు దూరం చేయడం తిరోగమన చర్య. ఇది రష్యా ప్రజల భద్రత మరింత తగ్గిస్తుంది. అయితే, యూజర్ల కనెక్టివిటీ కొనసాగేలా మేము ప్రయత్నిస్తున్నాము’ అని ఎక్స్ వేదికగా వాట్సాప్ పేర్కొంది. మరో మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావేల్ డురోవ్ కూడా రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ యాప్‌ను కూడా రష్యా అడ్డుకుంటోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.


వాట్సాప్ స్థానంలో మ్యాక్స్‌ అనే యాప్‌ను రష్యా ముందుకు తెస్తున్నట్టు సమాచారం. రష్యాలో ఇకపై విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్స్ అన్నింటిల్లో మ్యాక్స్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. జాతీయ చట్టాలను ఉల్లంఘించిన వాట్సాప్‌కు అడ్డుకట్ట వేసేందుకు రష్యా టెలికం నియంత్రణ సంస్థ చర్యలు ప్రారంభించినట్టు కూడా తెలుస్తోంది.


ఇవీ చదవండి:

హెచ్-1బీ వీసా రద్దు కోసం అమెరికాలో మరో ప్రయత్నం!

ఆ టారిఫ్స్‌ డబ్బును భారత్‌కు తిరిగి చెల్లించనున్న అమెరికా!

Updated Date - Feb 12 , 2026 | 05:41 PM