Share News

హెచ్-1బీ వీసా రద్దు కోసం అమెరికాలో మరో ప్రయత్నం!

ABN , Publish Date - Feb 10 , 2026 | 07:48 PM

హెచ్-1బీ వీసా రద్దు కోసం అమెరికాలో మరో ప్రయత్నం మొదలైంది. అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నేత గ్రెగ్ స్టూబీ ప్రతినిధుల సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

హెచ్-1బీ వీసా రద్దు కోసం అమెరికాలో మరో ప్రయత్నం!
Greg Stuebe

ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా రద్దు కోసం అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు ఒకరు రంగంలోకి దిగారు. ప్రతినిధుల సభ సభ్యులు, అధికార రిపబ్లికన్ పార్టీ నేత గ్రెగ్ స్టూబీ హెచ్-1బీ వీసాను రద్దు చేసేందుకు ఎక్సైల్ యాక్ట్‌ పేరిట బిల్లును సభలో ప్రతిపాదించారు. విదేశీ కార్మికుల వ్యవస్థ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు తాను ఈ బిల్లు తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. ఈ వీసా కార్యక్రమాన్ని రద్దు చేయడమే తన లక్ష్యమని అన్నారు.

ఎక్స్ వేదికగా తన బిల్లు గురించి గ్రెగ్ ప్రకటించారు. అవినీతిమయ హెచ్-1బీ వీసాకు ఫుల్ స్టాప్ పెట్టనున్నట్టు చెప్పారు. ఈ వీసా వల్ల అమెరికన్లు చాలా నష్టపోయారని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలు ఈ వీసాను దుర్వినియోగపరిచాయని మండిపడ్డారు. తమ లాభాలు పెంచుకునేందుకు తక్కువ జీతాలతో విదేశీ కార్మికులను నియమించుకున్నాయని అన్నారు. ఫలితంగా అమెరికా మార్కెట్‌లో కనీస జీతం తగ్గిపోయిందని, అనేక మంది అమెరికన్లకు మంచి జీతాలిచ్చే ఉద్యోగాలకు దూరమయ్యాయని అన్నారు.


ఈ బిల్లుపై గ్రెగ్ కార్యాలయం కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని సెక్షన్ 214(జీ)(1)(ఏ)కు సవరణ ద్వారా హెచ్-1బీకి ముగింపు పలుకుతామని తెలిపింది. హెచ్-1బీ వీసా ద్వారా వచ్చిన 5 వేల మంది విదేశీ డాక్టర్ల వల్ల 10 వేల మంది అమెరికా వైద్యులకు రెసిడెంట్ డాక్టర్లుగా అవకాశాలు దక్కలేదని పేర్కొంది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే 2027 నుంచీ ఒక్క హెచ్-1బీ వీసా కూడా జారీ కాదని తేల్చి చెప్పింది. గతంలో మార్జరీ టేలర్ గ్రీన్ అనే మరో రిపబ్లికన్ నేత కూడా హెచ్-1బీ వీసా రద్దు కోసం ఓ చట్టాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే.


ఇవీ చదవండి:

ఆ టారిఫ్స్‌ డబ్బును భారత్‌కు తిరిగి చెల్లించనున్న అమెరికా!

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభలో జరిగేది ఇదే

Updated Date - Feb 10 , 2026 | 09:11 PM