Share News

రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. షాకింగ్ సీన్స్

ABN , Publish Date - Oct 12 , 2026 | 08:58 AM

రియాద్ విమానాశ్రయంపై శనివారం జరిగిన మిసైల్ దాడి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. షాకింగ్ సీన్స్
Riyadh Airport Attack Video Goes Viral

ఇంటర్నెట్ డెస్క్: రియాద్ విమానాశ్రయంపై శనివారం జరిగిన దాడి వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అప్పటివరకూ ప్రయాణికులతో సందడిగా ఉన్న ఎయిర్‌పోర్టులో భారీ పేలుడు సంభవించడంతో ప్రయాణికులు చెల్లాచెదురయ్యారు. పేలుడు ధాటికి పైకప్పు భాగం కూడా కూలిపోయింది. ప్రయాణికులు క్యూలైన్లలో వేచి చూస్తున్న సమయంలో ఈ మిసైల్ దాడి జరిగింది. పెద్ద పేలుడుతో మంటలు చెలరేగాయి. ఈ దాడిలో ఓ హైదరాబాదీ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. మొత్తం 380 మంది గాయపడ్డారు. ఆ హైదరాబాదీ తన కుటుంబంతో సహా మదీనా వెళుతుండగా ఈ దాడి జరిగింది.


ఈ దాడికి తామే బాధ్యులమని హూతీలు ప్రకటించారు. దమ్మామ్ ఎయిర్‌పోర్టును కూడా తాము టార్గెట్ చేశామని హూతీ మిలిటెంట్ల ప్రతినిధి పేర్కొన్నారు. సౌదీ చమురు రంగ దిగ్గజం అరామ్కో సంస్థకు చెందిన రెండు కేంద్రాలపైనా దాడి చేశామని చెప్పారు. సౌదీ ఎయిర్‌పోర్టులకు వెళ్లొద్దని తాము ఇప్పటికే హెచ్చరించామని పేర్కొన్నారు. అనర్థం జరిగితే తాము బాధ్యత వహించమని స్పష్టం చేశారు. ఆదివారం కూడా రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడులు జరిగాయి. టర్మినల్ 4పై జరిగిన ఈ దాడిలో ఒకరు మరణించగా 11 మంది గాయపడ్డారని సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. తూర్పు ప్రావిన్స్ గగనతలంలో కొన్ని డ్రోన్స్‌ను కూడా అడ్డుకున్నామని సౌదీ దళాలు తెలిపాయి. సోమవారం తెల్లవారుజామున అభాలో ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేసి, ఆ తరువాత కొన్ని గంటలకు ఉపసంహరించుకున్నారు. గత కొన్ని రోజులుగా రియాద్ ఎయిర్‌‌పోర్టుపై జరుగుతున్న దాడుల్లో మరణాల సంఖ్య 18కు చేరింది.


ఈ వార్తలనూ చదవండి:

కన్న బిడ్డ హెల్త్ ఇన్సూరెన్స్‌నూ రద్దు చేశారు.. మస్క్‌పై మాజీ భార్య ఆరోపణ

కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!

Updated Date - Oct 12 , 2026 | 09:32 AM