ఖతార్‌కు ఉత్తరాన ఆయిల్ ట్యాంకర్‌పై మిసైళ్ల దాడి.. పలువురు సిబ్బంది మృతి..!
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:26 PM
గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. ఖతార్‌కు ఉత్తరాన ఓ ఆయిల్, కెమికల్ ట్యాంకర్‌పై శనివారం పలు మిసైళ్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నౌక సిబ్బందిలో కొందరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ధ్రువీకరించింది.
దోహా: గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. ఖతార్‌కు ఉత్తరాన ఓ ఆయిల్, కెమికల్ ట్యాంకర్‌పై శనివారం పలు మిసైళ్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నౌక సిబ్బందిలో కొందరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ధ్రువీకరించింది. అయితే, మృతులు, గాయపడిన వారి వివరాలను వెల్లడించలేదు. ఖతార్‌లోని మదీనత్ అల్-షమాల్‌కు సుమారు 51 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు యూకేఎంటీవో తెలిపింది.
సముద్ర భద్రతా సంస్థ వాన్‌గార్డ్ ప్రకారం.. ఆంటిగ్వా అండ్ బార్బుడా జెండాతో ప్రయాణిస్తున్న ‘ఏకర్స్’ అనే ఆయిల్, కెమికల్ ట్యాంకర్‌పై దాడి జరిగింది. సరకుతో హోర్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. మరోవైపు, సెప్టెంబర్ 9 ఘటన తర్వాత హోర్ముజ్ జలసంధికి ఇంత పశ్చిమాన వాణిజ్య నౌకపై దాడి జరగడం ఇదే తొలిసారని ఈవోఎస్ రిస్క్ గ్రూప్ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు జరిగిన 93 దాడి ఘటనల్లో కనీసం 24 మంది నావికులు మరణించినట్లు అంతర్జాతీయ సముద్ర రవాణా సంస్థ (IMO) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఫుజైరాకు తూర్పున గురువారం మరో ట్యాంకర్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ నౌక మార్షల్ దీవుల జెండా కలిగిన 'ధల్కుత్' అని భావిస్తున్నప్పటికీ.. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో దాదాపు ఐదో వంతు హోర్ముజ్ జలసంధి మీదుగా సాగుతుంది. తాజా దాడులతో అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే, గత రెండు వారాల్లో ఈ మార్గం ద్వారా రోజుకు సగటున 1.2 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు రవాణా జరిగినట్లు కెప్లర్ (Kpler) అంచనా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు.. భారత టెలికాం దిగ్గజాలపై మస్క్ ఆరోపణలు..
ఎలాన్ మస్క్, సత్య నాదెళ్లకు అమెరికా అత్యున్నత సైన్స్, టెక్నాలజీ పురస్కారాలు