అదే నిజమైతే ఇజ్రాయెల్ ఎప్పుడో మా సొంతమయ్యేది: ఖతార్
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:13 PM
ఇజ్రాయెల్ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేదని ఖతార్ గురువారం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇజ్రాయెలీ రాజకీయ నేతలు చేసిన ఆరోపణలను ఖండించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేదని ఖతార్ గురువారం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇజ్రాయెలీ రాజకీయ నేతలు చేసిన ఆరోపణలను ఖండించింది. ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలు సందిగ్ధంగా మారడంతో ఆ వివాదంలో తమను లాగేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు తాము నిధులు వెచ్చించలేదని ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజెల్ అల్ అన్సారీ తేల్చి చెప్పారు.
‘ఆ ఆరోపణల్లో అసలు ఏమాత్రం నిజం లేదు. ఇజ్రాయెలీ రాజకీయ నాయకులు, వారికి సంబంధించిన మీడియా చేస్తున్న ఆరోపణలను మేము ఖండిస్తున్నాము. ఈ వారం ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వారి దేశ రాజకీయ సమస్యల్లోకి మమ్మల్ని లాగేందుకు తప్పుడు ప్రచారానికి దిగారు. ఈ ఆరోపణలు నిజమే అయితే మొత్తం ఇజ్రాయెల్ ఎప్పుడో ఖతార్ సొంతమై ఉండేది’ అని అన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్కడి రాజకీయ నాయకులు తమను బలిపశువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పేరును వాడుకుని లాభపడుదామనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
అక్టోబర్ 27 నాటి ఎన్నికల ఫలితాల్లో ఇజ్రాయెల్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు రాకపోవడంతో పరిస్థితి ఊహించని మలుపు తిరిగింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సారథ్యంలోని లికుడ్ పార్టీతో పాటు ఇతర కూటమి పార్టీలకు పూర్తి మెజారిటీ రాలేదు. మరోవైపు, అరబ్ సంతతికి చెందిన ఇజ్రాయెలీ పౌరుల మద్దతున్న రెండు పార్టీలకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు రావడంతో అవి కింగ్ మేకర్లుగా మారాయి.
ఈ వార్తలనూ చదవండి:
హసీనా పారిపోతున్న వీడియో వైరల్.. ఎయిర్ఫోర్స్ అధికారి అనుమానాస్పద మృతి
ఆర్మేనియా పార్లమెంటులో ఎంపీల ఘర్షణ.. వీడియో వైరల్