హసీనా పారిపోతున్న వీడియో వైరల్.. ఎయిర్‌ఫోర్స్ అధికారి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:48 PM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోతుండగా తీసిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఓ ఎయిర్‌ఫోర్స్ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోతుండగా తీసిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఓ ఎయిర్‌ఫోర్స్ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం ఆ అధికారి అదృశ్యమయ్యారు. తాజాగా పోలీసులు ఆయన మృత దేహాన్ని గుర్తించారు. రాజధాని ఢాకాలోని తురాగ్ నదిలో ఆయన మృత దేహం లభించింది.
మృతుడిని ఫ్లైట్ లెఫ్టెనెంట్ కేఎమ్ తహ్సీఫ్ సౌరీగా గుర్తించారు. ఆయన మృతికి గల కారణం పోస్టుమార్టం నివేదిక తరువాత తెలుస్తుందని పోలీసులు చెప్పారు. 2024లో బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తీసిన ఓ వీడియో బంగ్లాదేశ్‌లో కలకలానికి దారి తీసింది. వీడియోను తహ్సీఫ్ సౌరీ రికార్డు చేశారన్న వార్త సంచలనంగా మారింది.
అయితే, సౌరీ సోదరి మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చారు. సౌరీ ఆ వీడియోను తీయలేదని, అతడి కొలీగ్ ఒకరు రికార్డు చేశారని చెప్పారు. తనకు అందిన వీడియోను ఓ పౌరుడిగా సౌరీ షేర్ చేశాడని చెప్పారు. వీడియో వైరల్ అయిన నాటి నుంచీ తమకు వేధింపులు మొదలయ్యాయని అన్నారు. చివరకు సౌరీ ఎయిర్‌ఫోర్స్‌ను వీడాల్సి వచ్చిందని అన్నారు. వీడియో కారణంగానే తన సోదరుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో కుట్ర పన్ని సౌరీని హత్య చేశారని ఆరోపించారు. తన సోదరుడిని డిటెక్టివ్‌లు ఫాలో అయ్యే వారని చెప్పారు. ఇటీవల ఎవరో పిలిస్తే బయటకు వెళ్లిన అతడు మళ్లీ తిరిగిరాలేదని కన్నీటిపర్యంతమయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్మేనియా పార్లమెంటులో ఎంపీల ఘర్షణ.. వీడియో వైరల్
ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై డ్రోన్ దాడి.. 13 మంది మృతి