Share News

ఆర్మేనియా పార్లమెంటులో ఎంపీల ఘర్షణ.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 29 , 2026 | 08:02 PM

ఆర్మేనియా పార్లమెంటులో నేడు షాకింగ్ సన్నివేశాలు ఆవిష్కృతమయ్యాయి. ఎంపీలు ఒకరినొకరు తన్నుకుంటూ, పిడిగుద్దుల వర్షం కురిపిస్తూ రణరంగం సృష్టించారు.

ఆర్మేనియా పార్లమెంటులో ఎంపీల ఘర్షణ.. వీడియో వైరల్
Armenia parliament fight

ఇంటర్నెట్ డెస్క్: ఆర్మేనియా పార్లమెంటులో నేడు షాకింగ్ సన్నివేశాలు ఆవిష్కృతమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీల మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. ఎంపీలు ఒకరినొకరు తన్నుకుంటూ, పిడిగుద్దుల వర్షం కురిపిస్తూ రణరంగం సృష్టించారు. ఎంపీల తీరుతో విసిగిపోయిన స్పీకర్ ఈ దారుణాన్ని ప్రజలందరూ చూడాలంటూ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగించాలని ఆదేశించారు.

ఆడిట్ ఛాంబర్‌కు ఓ సభ్యుడి ఎన్నిక సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. అధికార సివిల్ కాంట్రాక్ట్ పార్టీకి చెందిన ఎంపీ టారోన్ ఛాక్యోయాన్ ప్రతిపక్ష నేత నారెక్ కారాప్తెయాన్ బంధువు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి వివాదానికి తెరతీశారు. తాము అధికారంలోకి వస్తే మహిళల సంతృప్తి కోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామంటూ ఆ బంధువు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.


నాటి వ్యాఖ్యలపై ఇప్పటికీ ఆ వ్యక్తి క్షమాపణలు ఎందుకు చెప్పలేదని ప్రతిపక్ష నేతను అధికార పార్టీ నేత నిలదీయడంతో మొదలైన వాగ్వాదం ఊహించని మలుపు తిరిగింది. ఇరు పార్టీల నేతలూ ఒకరినొకరు తన్నుకునే వరకూ వెళ్లింది. సభ్యుల్ని అదుపు చేయలేక విసిగిపోయిన స్పీకర్ కూడా ఎంపీల తీరు ప్రజలకు తెలియాలంటూ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగించారు. పార్లమెంటు హాల్‌లో మొదలైన గొడవ భవనం కారిడార్లలో కూడా కొనసాగింది.

ఈ వివాదంలో ప్రతిపక్ష నేతదే తప్పు ఉందని స్పీకర్ చివరకు తేల్చారు. అధికార పార్టీ సభ్యుడి ప్రసంగాన్ని తాను విన్నానని, అందులో అభ్యంతరకరమైనది ఏదీ లేదని స్పష్టం చేశారు. ఈ ఘర్షణలో ఓ ఎంపీ ముక్కులోంచి రక్తం కారగా మరో ఎంపీ దుస్తులు చిరిగిపోయాయి. ఘర్షణ తీవ్రత దృష్ట్యా పార్లమెంటు సిబ్బంది అంబులెన్స్‌ను కూడా పిలిపించాల్సి వచ్చింది.


ఈ వార్తలనూ చదవండి:

ట్రంప్ దాడుల హెచ్చరికల వేళ.. పెంటగాన్ కీలక జనరల్‌పై వేటు

ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై డ్రోన్ దాడి.. 13 మంది మృతి

Updated Date - Oct 29 , 2026 | 08:13 PM