వాళ్లకు ఆ పేరు ఎందుకో అర్థం కాదు! పుతిన్ సెటైర్లు
ABN , Publish Date - Sep 11 , 2026 | 08:49 PM
దేశాల మధ్య పోటీ ఒక్కోసారి వికృత రూపం దాలుస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు పాశ్చాత్య దేశాలు తమ ప్రత్యర్థులను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు
ఇంటర్నెట్ డెస్క్: దేశాల మధ్య పోటీ ఒక్కోసారి వికృత రూపం దాలుస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు పాశ్చాత్య దేశాలు తమ ప్రత్యర్థులను అనైతిక విధానాలతో దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. న్యూఢిల్లీలో బిజినెస్ సమ్మిట్ సందర్భంగా పుతిన్ ఈ కామెంట్స్ చేశారు. ‘ఒక్కోసారి పోటీ వికృత రూపాలు దాలుస్తుంది. అంతర్జాతీయ సరకు రవాణా మార్గాల్లో ఆటంకాలు సృష్టించడం, పైపులైన్లను ధ్వంసం చేయడం, అక్రమ ఆంక్షలు విధించడం వంటి వికృత రూపాల్లో పోటీ కనిపిస్తుంటుంది’ అని చెప్పారు.
తమ స్వీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాలపై అదనపు ఆంక్షలు విధించడాన్ని రష్యా అధ్యక్షుడు తప్పుబట్టారు. రష్యాపై 30 వేల రకాల ఆంక్షలు విధించారని అన్నారు. ఇతర దేశాలపై విధించిన మొత్తం ఆంక్షలకు ఇది రెండు రెట్లు అని కామెంట్ చేశారు. అయితే, తాము మాత్రం తమ సార్వభౌమత్వాన్ని నిలుపుకున్నామని చెప్పారు. విశ్వసనీయ దేశాలతో వాణిజ్యంతో ఆర్థికాభివృద్ధి సాధించామని చెప్పారు. గత మూడేళ్లల్లో ప్రపంచ సగటు ఆర్థిక వృద్ధి రేటు కంటే మెరుగైన వృద్ధిని రష్యా సాధించిందని చెప్పారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారిపోతోందని పుతిన్ అన్నారు. 20వ శతాబ్దం ద్వితీయార్థంలో ఆర్థికాభివృద్ధికి కారణమైన దేశాల స్థానంలో కొత్త అభివృద్ధి కేంద్రాలు ఉనికిలోకి వచ్చాయని చెప్పారు. ఆధునిక సాంకేతికత, పరిశోధన, మౌలిక వసతులు కొన్ని దేశాల చేతుల్లోనే ఇప్పటికీ ఉన్నప్పటికీ మార్పులను ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రపంచం ఎప్పుడూ మారుతూనే ఉంటుందని అన్నారు.
జీ7 దేశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శలు గుప్పించారు. ప్రపంచ జీడీపీలో జీ7 దేశాల వాటా 18 శాతమేనని, అదే బ్రిక్స్ దేశాల వాటా మాత్రం 40 శాతమని అన్నారు. ‘గత ఐదేళ్లల్లో ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ దేశాల వాటా 40 శాతం. మరి గ్రేట్ 7ని చెప్పుకునే జీ7 దేశాల వాటా ఇంతకన్నా తక్కువే. వాళ్లు గ్రేట్ అని తమని తాము ఎందుకు పిలిచుకుంటారో? అని సెటైర్లు పేల్చారు.
ఈ వార్తలనూ చదవండి:
విశ్వసనీయ వ్యాపార సంబంధాలే వెన్నెముక: పుతిన్
మోదీ-పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక అంశాల్లో పురోగతిపై సమీక్ష