Share News

వచ్చే రెండేళ్లు అమెరికాలో హోరాహోరీయే!

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:27 AM

తాజా ఎన్నికల ఫలితాలతో అమెరికాలో రాజకీయం రసవత్తరంగా మారిపోనుంది.

వచ్చే రెండేళ్లు అమెరికాలో  హోరాహోరీయే!
trump

వాషింగ్టన్‌, నవంబరు 4: తాజా ఎన్నికల ఫలితాలతో అమెరికాలో రాజకీయం రసవత్తరంగా మారిపోనుంది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉంటే.. చట్టాలు చేసే కాంగ్రె్‌సలో డెమోక్రాట్లకు ఆధిపత్యం సమకూరింది. అధ్యక్షుడికి పగ్గాలు వేయగల అవకాశం డెమోక్రాట్లకు వస్తే.. వారి ఆధిపత్యంలోని కాంగ్రెస్‌ చేసే బిల్లులను ఆమోదించకుండా ఆపేసే అధికారం ట్రంప్‌ చేతిలో ఉంది. అమెరికాలో పాలన, నిర్ణయాలు, ఆ దేశం చేస్తున్న యుద్ధాలు, సుంకాలు, విదేశాంగ విధానాలు.. ఇలా ఎన్నో ప్రభావితమయ్యే పరిస్థితి నెలకొంది. అమెరికాలో తొలి నుంచీ అధ్యక్ష తరహా పాలన కొనసాగుతోంది.


అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లు. ప్రతి నాలుగేళ్లకు జరిగే ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి పోటీపడే అభ్యర్థుల్లో ఒకరిని ప్రజలు అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇక మన పార్లమెంటు తరహాలో అమెరికాలో చట్టసభలను కాంగ్రెస్‌ అంటారు. అందులో ప్రతినిధుల సభ (హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌), సెనేట్‌ ఉంటాయి. ఏ చట్టం చేయాలన్నా.. సంబంధిత బిల్లును ఈ రెండు సభలు ఆమోదించాల్సిందే. అనంతరం అధ్యక్షుడు సంతకం చేయాలి. ఆ తర్వాతే బిల్లు చట్టరూపం దాల్చి, అమల్లోకి వస్తుంది. అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు రెండేళ్లకు, అంటే అధ్యక్షుడి పదవీకాలం మధ్యలో ప్రతినిధుల సభ, సెనేట్‌కు ఎన్నికలు జరుగుతాయి. అందుకే వీటిని మధ్యంతర (మిడ్‌ టెర్మ్‌) ఎన్నికలు అని పేర్కొంటారు. అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు, అధికారిక ఆదేశాల్లో కీలకమైన వాటిని కాంగ్రెస్‌ ఉభయ సభలు ఆమోదించాల్సి ఉంటుంది. అధ్యక్షుడి ఆదేశాలకు నిర్ణీత గడువులోగా కాంగ్రెస్‌ ఆమోదం లభించకపోతే సదరు ఆదేశాలు రద్దవుతాయి. లేదా పలు నియంత్రణలు వర్తిస్తాయి. ఉదాహరణకు ఏదైనా దేశంపై అధ్యక్షుడు సైనిక చర్య చేపట్టినప్పుడు.. 60 రోజుల్లోగా కాంగ్రెస్‌ అనుమతి పొందాలి. లేకుంటే ఆ యుద్ధాన్ని నిలిపివేయక తప్పదు. ఇరాన్‌పై యుద్ధం విషయంలో ట్రంప్‌ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్‌లోని రెండు సభలు ఏదైనా అంశంపై బిల్లును ఆమోదించి, పంపినా.. అధ్యక్షుడు సంతకం పెట్టకుండా పక్కన పెట్టేయవచ్చు.

Updated Date - Nov 05 , 2026 | 06:27 AM